విశాఖ ఉక్కుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్యాకేజీ ప్రకటించడం కేవలం హామీలు అమలు చేయడం కాదనీ, ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో నిదర్శనమని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కుకు ప్రధానీ మోదీ ప్రాణం పోశారని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మాట నిలబెట్టుకున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ప్యాకేజీని ముడి సరుకు, మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ల కోసం వెచ్చిస్తామని అన్నారు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో విశాఖది ప్రత్యేక స్థానం అని, ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్రం కాపాడిందని, ప్లాంట్ ను నిలబెడతామన్న కూటమి మాట నిలబెట్టుకుందని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ అన్ని సమస్యలు పరిష్కరిస్తోందని తెలిపారు.
Also Read : విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ
అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రులు:
అంతకు ముందు కేంద్రం విశాఖకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో భాగంగా ఈ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.10,300 కోట్లు ఈక్విటీ క్వాపిటల్ గా, రూ.1140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ గా అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు.