
- సముద్రంలో వృథాగా కలిసే నీటితోనే ప్రాజెక్టు చేపడ్తున్నం: ఏపీ సీఎం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణ రెండింటికీ గోదావరిలో మిగులు జలాలున్నయ్
- కృష్ణా జలాల్లో సమస్యలున్నయ్.. మాకిచ్చిన వాటానే వాడుకుంటున్నం
- దీనిపై రాజకీయాలు చేయడం మంచిది కాదని కామెంట్
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి మిగులు జలాలతోనే గోదావరి–బనకచర్ల లిఫ్ట్చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సముద్రంలో వృథాగా కలిసే నీటితోనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. గురువారం ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ, ఏపీలకు సంబంధించి గోదావరిలో మిగులు జలాలున్నాయి.
నదుల అనుసంధానంలో భాగంగా ఆ మిగులు జలాల ఆధారంగానే 200 టీఎంసీలను బనకచర్లకు పోలవరం నుంచి తరలిస్తాం. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ కరువు రహితంగా మారుతుంది. 80 లక్షల మందికి తాగునీరు అందడంతో పాటు 7.5 లక్షల హెక్టార్లకు కొత్త ఆయకట్టు వస్తుంది. 22.58 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తాం. 20 టీఎంసీల నీటిని పరిశ్రమలకు అందించేందుకు వీలవుతుంది” అని తెలి పారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించామని చెప్పారు.
2027లోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ‘‘గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను క్లియర్చేశాను. కృష్ణా డెల్టా స్కీమ్‌తో భీమాకు 20 టీఎంసీలు ఇచ్చాం. దేవాదులపైన గోదావరి నీళ్లను తెలంగాణ కూడా వినియోగించుకుంటున్నది. అయితే, కృష్ణా జలాల వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి. మేం మాకు కేటాయించిన జలాలనే వాడుకుంటున్నాం. ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటున్నదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు”అని అన్నారు.
పవన్.. హిమాలయాకు వెళ్తున్నారా?: మోదీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వస్త్రధారణపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. గురువారం ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న ఎన్డీయే మిత్రపక్షాల నేతలను ప్రధాని మోదీ పలకరించారు. ఆ టైమ్ లో పవన్ దగ్గరికి వచ్చి, ఆయన వస్త్రధారణను చూసి.. ‘మీరు హిమాలయాలకు వెళ్తున్నారా?’ అని సరదాగా సెటైర్లు వేశారు. కాగా, మోదీ ఏమన్నారని మీడియా ప్రశ్నించగా.. ‘‘ప్రధాని నాపై చాలాసార్లు జోకులు వేస్తుంటారు. ఈరోజు నా వస్త్రధారణ చూసి.. ‘అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నావా?’ అని అడిగారు. అలాంటిదేమీ లేదని నేను బదులిచ్చాను. చేయాల్సింది చాలా ఉంది అని చెప్పాను’’ అని పవన్ తెలిపారు.