పోలవరంపై వైట్ పేపర్ విడుదల

హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం అమరావతిలో వైట్ పేపర్  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. ‘‘పోలవరం సెంట్రల్  గవర్నమెంట్  ప్రాజెక్టు. వైసీపీ చీఫ్​ జగన్  రెడ్డి 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆ ప్రాజెక్టును రివర్స్  టెండరింగ్  చేయాలని పట్టుబట్టారు. కాఫర్  డ్యామ్, డయాఫ్రం గోడలు డ్యామేజ్  అయ్యాయి. డయాఫ్రం గోడల నిర్మాణం పూర్తయ్యే వరకు ఈసీఆర్ఎఫ్​ కట్టలేం.

గ్యాప్  1 గోదావరి వరదలకు 150 మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయింది. ఇక బాధితులకు గత ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించలేదు” అని చంద్రబాబు పేర్కొన్నారు. డ్యామేజ్  అయిన ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చే నెల మొదటి వారంలో అమెరికా, కెనడా నుంచి అంతర్జాతీయ నిపుణులు వస్తారని ఆయన  తెలిపారు. కాగా.. అమెరికా నుంచి డేవిడ్  బి.పాల్, గైస్  ఫ్రాంకో డి సిస్కో.. కెనడా నుంచి రిచర్డ్  డొనెల్లి, సీస్  హిన్స్ బర్గర్ ను కేంద్ర ప్రభుత్వం రప్పిస్తున్నట్లు సమాచారం. శనివారమే వారు ఇండియాకు బయల్దేరనున్నారు. అంతకుముందు జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు వారితో చర్చలు జరిపారు.

చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గ‌వ‌ర్నర్  సీపీ  రాధాకృష్ణన్  సమావేశమయ్యారు. శుక్రవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. 2 గంటల పాటు ఇద్దరూ వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెండింగ్​లో ఉన్న విభ‌జ‌న అంశాల‌పై చ‌ర్చించినట్టు తెలుస్తోంది.   ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన అస్పష్టంగానే ఉన్నాయి. అనంత‌రం గవర్నర్‌‌.. విజ‌య‌వాడ చేరుకొని క‌న‌క‌దుర్గ అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. త‌రువాత ఏపీ గ‌వ‌ర్నర్  అబ్దుల్ న‌జీర్​ను రాజ్ భ‌వ‌న్​లో మ‌ర్యాదపూర్వకంగా క‌లిశారు.