
- కేంద్ర జలవనరుల మంత్రి పాటిల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు వినతి
న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి వరద జలాల పేరుతో తెలంగాణ వాటాకు నష్టం వాటిల్లేలా నిర్మించతలపెట్టిన బనకచర్లకు సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంపై ఒత్తిడి పెంచింది. సముద్రంలో కలిసే వృథా నీటితో రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను చేపట్టినట్లు కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విస్తృత ప్రయోజనాలు కలుగుతాయంటూ వివరించింది. విదేశీ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
తొలుత కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో.. పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కు సహకారాన్ని కోరారు. ఈ ప్రాజెక్ట్ కు కావాల్సిన అనుమతులు, కేంద్ర సాయంపై సుదీర్ఘంగా చర్చించారు. వరద జలాలపై మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలు సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధుల మంజూరుపై చర్చించారు. అనంతరం న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కర్నూలులో హై కోర్టు బెంచ్ అంశంపై ఆయనతో చర్చించారు.
బెంచ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ అమలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయెల్ తో భేటీ అయిన సీఎం.. అమెరికా టారిఫ్‌ల కారణంగా రాష్ట్రంలో ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై డిస్కస్ చేశారు. దేశ సీ ఫుడ్స్ పై విధించిన 26 శాతం సుంకాలు ఏపీలోని ఆక్వా రంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని వివరించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. చివరగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించి మద్దతుగా నిలవాలని కోరారు.