- ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తెలుగు ప్రజలే ఎక్కువ: చంద్రబాబు
- అంతర్జాతీయ తెలుగు మహాసభలను ప్రారంభించిన ఏపీ సీఎం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తెలుగు ప్రజలే ఎక్కువగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమెరికా వెళ్లి స్థిరపడిన వాళ్లలో, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్లలో తెలుగు వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. తెలుగు వాళ్లు ఏ దేశంలో ఉన్నా సొంతూరును, మాతృభాషను మరువొద్దని సూచించారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలను శుక్రవారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమెరికా, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలను చూస్తే సంతోషంగా ఉందన్నారు. ‘‘ప్రతి రెండేండ్లకు ఒకసారి తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయం. ఇందుకు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఇందిరాదత్ చాలా కృషి చేస్తున్నారు. ఈ సమాఖ్యను ఎన్టీఆర్ స్థాపించగా, అప్పటి నుంచి తెలుగు వాళ్లందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నారు. అనంతపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి మహబూబ్ నగర్ వరకు ఎవరు ఎక్కడున్నా తెలుగు వాళ్లంతా ఒక్కటే. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెబుతుంది. విదేశాల్లో సైతం ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా ఏపీ, తెలంగాణ అని చూడకుండా పరస్పరం సహకరించుకోవాలి” అని సూచించారు.
ఇప్పుడు ఏఐకే డిమాండ్..
హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధిలో టీడీపీ కీలకపాత్ర పోషించిందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఐటీ కంటే ఏఐకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని చెప్పారు. ‘‘గతంలో విజన్ 2020కి ప్లాన్ చేసి, అందుకోసం కృషి చేశాం. ఇప్పుడు విజన్ 2047 కోసం పని చేస్తున్నాం. అప్పటి కల్లా మన దేశం వరల్డ్ నంబర్ వన్ గా ఎదగడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ మహాసభలకు శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం జరిగే ముగింపు వేడుకల్లో మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొంటారు.