హైదరాబాద్, వెలుగు: ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓపెన్ స్కై పాలిసీని తీసుకొచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు కోసం గతంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో 32 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు. ఇప్పుడు హైదారాబాద్ ఇండియాలో చాలా బెస్ట్ సీటీ అని తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జాతీయ స్థాయి డ్రోన్ సమిట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "భవిష్యత్తులో డేటా ఆస్తిగా మారుతుంది. మీ దగ్గర డేటా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాడి అద్భుతాలు చెయ్యెచ్చు.
డ్రోన్లకు ప్రోగ్రామ్ ఇచ్చి ఇన్ఫర్మెషన్ తెప్పించుకోవచ్చు" అని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ డ్రోన్ సమిట్‌లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గర దేశంలోనే తొలిసారి 5,500 డ్రోన్లతో భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఐదు గిన్నిస్ రికార్డులతో అమరావతి డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టికి, లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, డ్రోన్ల ద్వారా అతిపెద్ద జెండాప్రదర్శన, ఏరియల్ లోగోతో మొత్తం ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ధ్రువపత్రాలు అందించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.