అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో వైసీఎల్పీ సమావేశం నిర్వహించారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో.. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత వైసీపీ వైసీఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనితీరు ఆధారంగానే ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు ఉంటుందని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాం. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందింది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఆ 50 మందికి ఈసారి ఎన్నికల్లో టికెట్ కష్టమే. పనితీరు, ఆరోపణల నేపథ్యంలో కొంతమందిపై వేటు పడే అవకాశముంది. అదేవిధంగా పార్టీమారే అవకాశం ఉన్న ఇంకొందరిపై కూడా వేటు వేయనున్నాం. తొలిసారి ఎన్నికైన 30 మంది ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తిగా ఉంది. వీరితో పాటు 12 మంది సీనియర్ ఎమ్మెల్యేల తీరుపై కూడా అసంతృప్తి ఉంది. మరో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేపైనా వేటు పడే చాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా అధిష్టానం చేతిలో 50 మంది పర్‍ఫార్మెన్స్ రిపోర్ట్ ఉంది.
ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గరే కూర్చుంటే సరిపోదు. ప్రజలే వచ్చి కలవాలంటే కుదరదు. ప్రజల్ని నేరుగా కలవకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవరు. పనిచేసిన వారికే టికెట్ల కేటాయింపు ఉంటుంది. ఎమ్మెల్యేలు కనీసం మూడుసార్లు గడపగడపకు తిరగాలి. సర్వేల్లో పేర్లు రాకపోతే సీట్ల కేటాయింపుల్లో కచ్చితంగా మార్పులు వస్తాయి. అందుకే క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలి అంటున్నాను. బూత్ కమిటీలను బలోపేతం చేయాలి. బూత్ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి. ఏప్రిల్ కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలి. కొత్త జిల్లాల వారీగా రీజినల్ కో ఆర్డినేటర్లను నియమిస్తాం. జులై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తాం. మంత్రి వర్గాన్ని కూడా పునర్వవస్థీకరిస్తాం. 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. దీని వల్ల మనం గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లగలం. టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మనం చేస్తున్న యుద్ధం చంద్రబాబుతోపాటు కొంత మంది ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.