ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి

 ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి
  • ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం జగన్
  • రాయలసీమ ప్రాజెక్టుకు పర్యావరణ పర్మిషన్ ఇవ్వాలని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు వినతి
  • అనుమతులు లేకుండా పాలమూరు,దిండి నిర్మిస్తోందని తెలంగాణపై ఏపీ కంప్లైంట్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ విద్యుత్​పంపిణీ సంస్థ(డిస్కం)ల నుంచి రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను ఇప్పించాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోడీతో జగన్ అర గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్​లో తెలంగాణ నుంచి రావాల్సిన కరెంటు బకాయిలు, ఎనిమిదేండ్లుగా నెరవేరని విభజన హామీలు, ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్​లు తదితర అంశాలపై చర్చించినట్లు ఏపీ సీఎంవో వెల్లడించింది. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరినట్లు తెలిపింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు నెరవేర్చలేదని పీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా చాలా అంశాలు ఎటూ తేలకుండా ఉన్నాయని గుర్తుచేశారు. వీటిపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమైందని వివరించారు. షెడ్యూల్ 9, 10 సంస్థలు, ఇతర ముఖ్య సంస్థల విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వంటి అనేక అంశాలు పెండింగ్​లోనే ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ తీరు ఏకపక్షం

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌ ప్రాజెక్టులలో తెలంగాణ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం జగన్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్​కు ఫిర్యాదు చేశారు. కేఆర్ఎంబీ ఆపరేషనల్‌‌ ప్రోటోకాల్స్‌‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని వివరించారు. దీంతో కృష్ణా నదిపై వాటా హక్కులను ఏపీ కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. 2021–22, 2022–23 వాటర్​ ఇయర్​లో సీజన్‌‌ ప్రారంభమైన తొలిరోజు నుంచి (అంటే జూన్‌‌ 1 నుంచే) తెలంగాణ విద్యుత్‌‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్​లో కనీస నీటిమట్టం 834 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్‌‌ ఉత్పత్తికి నీటి విడుదల చేస్తుందన్నారు. కేఆర్‌‌ఎంబీ ముందు ఎలాంటి ఇండెంట్‌‌ కూడా లేకుండానే ఏకపక్షంగా నాగార్జున సాగర్, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటిని విడుదల చేస్తోందని తెలిపారు. విద్యుత్‌‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 796 అడుగుల వరకు నీటిని విడుదల చేస్తూ.. శ్రీశైలంలో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదన్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యంకాదని వివరించారు. పోతిరెడ్డి పాడు నుంచి రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు,  పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నై మహానగరానికి తాగు నీరు అందించడం సాధ్యం కాదన్నారు.

పాలమూరు‑రంగారెడ్డికి అనుమతుల్లేవని ఫిర్యాదు

పర్యావరణ అనుమతుల్లేకుండానే తెలంగాణ పాలుమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తోందని జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులతో రిజర్వాయర్ నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదన్నారు. దీంతో ఏపీకి కేటాయించిన నీటిని వాడుకోవడం కూడా సాధ్యం కాదన్నారు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీంను అమలు చేయడం మినహా ఏపీ సర్కార్​కు ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేసినట్లు గుర్తు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర అటవీపర్యావరణ శాఖ అధికారులకు మధ్య సమగ్ర చర్చలు జరిగాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ప్రాజెక్టు ఎకో సెన్సిటివ్‌‌ జోన్‌‌(ఈఎస్‌‌జెడ్‌‌) నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అందువల్ల వీలైనంత త్వరలో రాయలసీమ లిప్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు.