ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలను మరింత ముమ్మరం చేశారు. ఇటీవలే అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన...మే 3న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో కార్యలయం విడుదల చేసింది.
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మే3న వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజున ఉదయం ఉదయం 8 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 10 గంటలకు భోగాపురం మండలం ఎ రావివలసకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10:25 నిమిషాలకు జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు. 10:30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్‌మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ వంటివి అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉంటుంది
అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. 10:55 నిమిషాలకు సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు జగన్ విశాఖపట్నానికి పర్యటనకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌కు చేరుకుని అదాని డేటా సెంటర్, వైజాగ్ ఐటీ టెక్ పార్క్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో జగన్ పాల్గొంటారు. 3:50 నిమిషాలకు రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 5.30 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరి 6:45 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్న ప్రదేశాలు, బహిరంగ సభా ప్రాంగణాలను వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.