మేనిఫేస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామన్నారు ఏపీ సీఎం జగన్. 2019 మేనిఫేస్టోను 99 శాతం అమలు చేశామని చెప్పారు. నేరుగా ఇంటికే పథకాలు డోర్ డెలివరీ చేశామని చెప్పారు. చేయగల్గినవి మాత్రమే చెప్పి.. చెప్పినవన్నీ అమలు చేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నానన్నారు జగన్. 58 నెలల్లో 99 శాతం అమలు చేశామని..ఈ ఐదేళ్లలో మేనిఫేస్టోకు గుర్తింపు వచ్చిందన్నారు.
పాదయాత్రలో పేదల కన్నీళ్లు కళ్లారా చూశానని జగన్ చెప్పారు. కరోనా సమయంలో కష్టాలున్నా సాకు చెప్పలేదన్నారు. ఎక్కడా లంచాలు లేకుండా డీబీటీ ద్వారా పథకాలు అమలు చేశామన్నారు. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ వాటిని అమలు చేశామన్నారు.
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు జగన్. రుణమాఫీ చేస్తామని చేయలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు జగన్. గ్రామ స్వరాజ్యాన్నిచేసి చూపించాం 2019లోనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. వైసీపీ పాలనకు, గత పాలకుల పాలనకు తేడా గమనించాలని చెప్పారు.