
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 4.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి జగన్ కాసేపు అక్కడే గడపనున్నారు. రాత్రి 7:30 గంటలకు విజయవాడకు పయనం కానున్నారు.
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు దృష్టి దోష నివారణకు వైయ్యూహి యాగం నిర్వహిస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా సమతామూర్తి ప్రాంగణంలోని 33 దివ్య దేశాలకు జీయర్ స్వాములు, రుత్వికులు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు. యాగశాలలో సంస్కరించిన 33 స్త్రీ దేవతామూర్తులతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. యాగశాల నుంచి దివ్య దేశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. అనంతరం వ్యక్తిత్వ వికాసం, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరగనుంది.