
ప్రజావేదికలో కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్ సూచనలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఉండవల్లి ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. మంత్రులు, 13 జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది.
సమావేశంలో మంత్రులకు పాలనపై కీలకమైన సూచనలు చేశారు సీఎం జగన్. పథకాలు జనాలకు అందడంలో లంచం అనే మాట వినిపించకూడదని అన్నారు. గ్రామ వాలంటీర్లను పార్టీలతో సంబంధం లేకుండా రిక్రూట్ చేయాలన్నారు. 50 ఇళ్ల పరిధిలో మాత్రమే ఉంటారు కాబట్టి.. ఎవరైనా లంచం తీసుకుంటే ఆ గ్రామ వాలంటీర్ ను ఫైర్ చేస్తామన్నారు. గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడితే సీఎం ఆఫీస్ కే నేరుగా ఫోన్ చేయవచ్చని ప్రజలకు సూచించారు జగన్.
“ఏపీలో ఇసుక మాఫియా, క్లబ్ లు ఏవీ ఉండకూడదు. పాదయాత్రలో నేను గ్రామస్థాయిలో చూశాను. పెన్షన్ కావాలంటే లంచం… చివరికి బాత్రూములు కావాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తోంది. కాంట్రాక్టులు అంటేనే అవినీతి అనే స్థాయికి తీసుకువచ్చారు. రోడ్లు, సెక్రటేరియట్ … అన్నింటా అవినీతి జరిగింది. వీటిని తొలగించేందుకు రివర్స్ టెండరింగ్ తెచ్చాం” అన్నారు జగన్.
ఏ పథకమైనా ప్రతి అర్హుడికి అందాలని కలెక్టర్లకు సూచించారు జగన్. అణగారిన వర్గాలను బాగుచేయడం కోసమే మ్యానిఫెస్టోలో నవరత్నాలు చేర్చామన్నారు. కులం, మతం ఏదీ చూడవద్దు.. పార్టీ చూడొద్దు. మనకు ఓటువేయని వారికి కూడా పథకం అందాలి… రాజకీయాలు ఎన్నికల వరకే అని చెప్పారు జగన్.