చెప్పులు చూపిస్తూ.. బూతులు మాట్లాడడమేంటి: జగన్

చెప్పులు చూపిస్తూ.. బూతులు మాట్లాడడమేంటి: జగన్

పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఆగ్రహం
 

కృష్ణా జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మూడు రాజధానులతో మంచి జరుగుతుందని చెబుతుంటే....మూడు పెళ్లిళ్లతోనే లాభం జరుగుతుందని కొందరు చెబుతున్నారంటూ మండిపడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో షరతులు గల పట్టా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హాజరైన ప్రజలనుద్దేశించి జగన్ ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జగన్  ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఇంటింటా అవ్వా.. తాతల గురించి.. అక్క చెల్లెమ్మల గురించి.. ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటే.. మొన్ననే దత్త పుత్రుడితో.. దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో మనం అంతా చూస్తున్నాం.. మనం ఎవరికీ కూడా అన్యాయం చేయకుండా.. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా.. 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతుంటే.. కాదు.. 3 పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతాయి.. మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు మాట్లాడడం మొదలుపెట్టారు..’’ అని జగన్ ఎద్దేవా చేశారు.

‘‘నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్లు ఈ మధ్యన టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ. .. దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు.. అవి మామూలు బూతులు కూడా కాదు.. వీధి రౌడీలు కూడా ఇలాంటి బూతులు మాట్లాడరనిపిస్తుంది.. ప్రతి ఒక్కరూ 3, 4 పెళ్లిళ్లు చేసుకుని.. నాలుగేండ్లు..లేదా ఐదేండ్లు కాపురం చేసి విడాకులిచ్చి... మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటే రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి..? వ్యవస్థ ఏం బతుకుతుంది.. ఆడవాళ్ల మానప్రాణాలు ఏమవుతాయి.. ఇలాంటి వారు మన నాయకులా..? ఇలాంటి వారు మనకు దశ.. దిశ చూపగలరా...?’’ అని జగన్ ప్రశ్నించారు. 

‘చేసిన మంచి ఏమిటి చెప్పుకోలేరు.. ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి.. దుష్ట చతుష్టయం కూటమిగా ఏర్పడుతున్నారని విమర్శించారు. ‘‘ రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు, మోసాలు పెరుగుతాయి.. ఇలాంటి  మోసాలను ఎవరూ నమ్మొద్దు.. నేను ప్రతి అవ్వా తాతను.. అక్కా చెల్లి, అన్నదమ్ములను నమ్ముకుంటే.. వారు కుళ్లు, కుతంత్రాలు, మీడియాను నమ్ముకున్నారు.. ఎల్లో మీడియా పేపర్లను చదవొద్దు.. వారి టీవీలను చూడొద్దు.. ’’ అని  జగన్ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయానికి, సమాజాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న వారికి మధ్య యుద్ధం జరుగుతుంది.. మంచిని మాత్రమే కొలమానంగా తీసుకోండి.. మంచి జరిగిందంటే తనకు అండగా నిలవాలని జగన్ కోరారు.