విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పలికారు. సీఎం జగన్ తరపున మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేశారు. సినీ పెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సినీ ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాలని మంత్రి పేర్ని నాని కోరారు. కరోనా లాక్ డౌన్ వల్ల చాలాకాలంగా సినిమా థియేటర్లు మూతపడి ఉన్న విషయం తెలిసిందే. థియేటర్లు ఫుల్ కెపాసిటీతో నడిచేందుకు కోవిడ్ నిబంధనలు అంగీకరించడం లేదు.
ఈ నేపధ్యంలో సినీ పరిశ్రమ, థియేటర్లపై ఆధారపడిన వారు చాలా ఇబ్బందుకరపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సినిమా టిక్కెట్ రేట్ల గురించి సిని కార్మికుల బతుకు తెరువు సహా.. పంపిణీ వర్గాల వేతనాల గురించి భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. గతంలోనూ తెలుగు సినిమా రంగం సమస్యల పరిష్కరించే విషయంలో మంత్రి పేర్ని నాని చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడంతో చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు మంత్రి పేర్ని నాని చిరంజీవిని ఆహ్వానించారు. సినీ ప్రముఖులతో కలసి వచ్చి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో చర్చించాలని కోరారు. సీఎం జగన్ సలహా మేరకు ఈ నెలాఖరులోగా ఏపీ సీఎంతో సినీ ప్రముఖులు భేటీ అయి ముఖాముఖి చర్చించే అవకాశం ఉంది.