
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశం
ఆయన హయాంలో అక్రమాలపై సబ్ కమిటీ
టీడీపీ హయాంలో సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను దోచి పెట్టారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వాలు అక్రమంగా దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ల్యాంకో స్పెక్ట్రంతో టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందం గడువు తీరినా యూనిట్‌కు 40 పైసలు అదనంగా ఇస్తూ కొనుగోళ్లు జరిపారని, దీంతో మూడేళ్లలో రూ.276 కోట్లకు పైగా ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని ఆ కంపెనీ నుంచే వసూలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ అక్రమాలకు కారకులైన అప్పటి అధికారులు, మంత్రులతో సహా మాజీ సీఎం చంద్రబాబును కూడా విచారించాలని ఆదేశించారు. 30 అంశాల్లో జరపనున్న విచారణలో ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌సంస్థలు కూడా సబ్ కమిటీకి సహకరిస్తాయన్నారు.ఈ సబ్ కమిటీ 30 అంశాలపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు. బుధవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఆర్టీఏ, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, సౌర విద్యుత్ కొనుగోల్లలో జరిగిన అక్రమాలపై కొరడా ఝలిపిస్తామన్నారు. ఐదేళ్లలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి కారణంగా 2019 నాటికి విద్యుత్ రంగం రూ.18,375 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోలు కోసం పవన, సౌర విద్యుత్‌కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు దేశంలోనే అతి పెద్ద స్కాంలుగా నిలుస్తాయన్నారు. పవన, సౌర విద్యుత్ను అధిక ధరకు కొనుగోలుతో రూ. 2,636 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
క్రిమినల్ కేసులు పెట్టండి
సమీక్షల్లో భాగంగా ఏ రంగాన్ని ముట్టుకున్నా గత ప్రభుత్వ కుంభకోణాలే కనిపిస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. విద్యుత్ ఎక్కువ ధరకు కొనడానికి కారణాలను తేల్చి అందుకు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ రేట్లకు కొన్నది ఎవరు? ఇలా కొనాలని ఎవరు నిర్ణయించారు? అనే విషయాలు తనకు స్పష్టంగా తెలియాలని, ప్రజల సొమ్మును ఇలా దోచిపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులోనూ భారీగా దోచేశారన్నారు. ప్రాజెక్టులపై త్వరలోనే రివర్స్‌టెండరింగ్ ప్రక్రియకు చర్యలు తీసుకోవాలన్నారు. సీఆర్డీఏ పరిధిలో జరుగుతున్న ప్రతి అంశంలోనూ అవినీతి కనిపిస్తోందన్న సీఎం రాజధాని పనులపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు, ప్రభుత్వానికి ఉపయోగపడే విధానాన్ని రూపొందించాలన్నారు.
సాగుకు 9 గంటల
ఉచిత విద్యుత్ అమలు
రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. వ్యవసాయానికి ఉచితంగా పగటిపూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా గురువారం నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 60 శాతం ఫీడర్లలో వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటలపాటు పగటిపూట విద్యుత్ అందేలా చూడాలని సూచించారు. 2020 జులై నాటికల్లా మిగిలిన 40శాతం ఫీడర్ల కింద విద్యుత్ అందజేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రూ.1700 కోట్లు విడుదల చేస్తూ.. పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.