- ఆయన ఆస్తుల కోసం రక్త సంబంధాన్ని కూడా మరిచారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఆస్తుల మీద ఉన్న ప్రేమతో రక్త సంబంధాన్ని కూడా జగన్ మర్చిపోయారని ఆయన చెల్లె, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. నాలుగ్గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తెచ్చారని, అది చాలదన్నట్టు ఇప్పుడు కోర్టు దాకా తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. ‘‘చట్ట విరుద్ధమని తెలిసినా చెల్లెలి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది అబద్ధం.
జగన్ బెయిల్ రద్దు చేసేందుకు మేం కుట్ర పన్నామనేది ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్” అని అన్నారు. జగన్ తన ఆస్తులను లాక్కునేందుకు ఈడీ కేసులు, బెయిల్ రద్దు అంటూ ఏవేవో కారణాలు చెబుతున్నారని మండిపడ్డారు. గురువారం విజయవాడలో మీడియాతో షర్మిల మాట్లాడారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదని స్పష్టం చేశారు
“ఈడీ కేవలం రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసింది. కంపెనీ షేర్ల వరకు రాలేదు. ఏ సమయంలోనైనా వాటిని బదిలీ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లలో ఉన్న చాలా కంపెనీలకు సంబంధించి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. అయినా వాటి షేర్ల ట్రేడింగ్ నడుస్తున్నది. షేర్లు కూడా బదిలీ అవుతున్నాయి. 2016లో ఈడీ అటాచ్ చేసినందు వల్ల షేర్లు బదిలీ చేయకూడదని జగన్ వాదిస్తున్నారు. అలా చేస్తే తన బెయిల్ రద్దవుతుందంటున్నారు” అని ఫైర్ అయ్యారు. వాటాలు ఇస్తామని ఎంవోయూలపై సంతకాలు చేసినప్పుడు, గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు బెయిల్ సంగతి గుర్తుకురాలేదా? అని ఆమె ప్రశ్నించారు.
‘‘అసలు నిజం ఏమిటంటే.. మొన్నటి ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత జగన్‌కి ఈ ప్రాజెక్టును వదులుకోవడం ఇష్టం లేదు. భారతి సిమెంట్స్ బ్యానర్ కింద సరస్వతి సిమెంట్‌ను నిర్వహించాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈడీ అటాచ్ మెంట్ అంశాన్ని లేవనెత్తారు. షేర్లను బదిలీ చేయలేమని చెబుతున్నారు” అని చెప్పారు.