YS Sharmila: టీడీపీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్.. అన్న పాలనపై సెటైర్

అమరావతి: విత్తనాల కొరతపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా అని నిలదీశారు. సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా అని షర్మిల విస్మయం వ్యక్తం చేశారు.

రాత్రంతా క్యూలైన్లో రైతులను నిలబెట్టడమా మీ NDA ప్రభుత్వ ఏలుబడి అని ఆమె ప్రశ్నించారు. సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు అని షర్మిల ఎద్దేవా చేశారు. రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని గుంజుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా మీకు పట్టం కట్టింది, జగన్ నిండా ముంచారనే కదా 11 సీట్లకు పరిమితం చేసిందని టీడీపీ ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నలు సంధించారు. మోసం చేశారనే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని వైసీపీ పాలనపై షర్మిల విమర్శలు చేశారు. రైతులను వ్యతిరేకించే బీజేపీతో మీరు కూటమి కట్టి, పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి, గద్దెనెక్కి, ఇప్పుడు వాళ్లను వర్షంలో నిలబెట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది మీ సర్కారుకి న్యాయమా అని ప్రశ్నించారు. నాట్లు వేసిన 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని జేజీఎల్ 384 రకం విత్తనాలను కావాలని అడగడం రైతులు చేసిన పాపం అంటారా అని నిలదీశారు. రైతు అడిగింది ఇవ్వాలని హక్కుగా మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుందో, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.