అయిననూ పోయి రావలె హస్తినకు.. బాబు ఢిల్లీ పర్యటనలపై షర్మిల సెటైర్లు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం(జులై 16) ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన రాత్రి కేంద్ర హోమంత్రి అమిత్ షాతో గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం ఇవాళ ఉదయం సీఎం అధికారిక నివాసం(1, జన్‌పథ్)లో పూజా కార్యక్రమాలు నిర్వహించాక విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. 

కేంద్రంలో చక్రం తిప్పాల్సిన బాబు.. ఆదిమ మరిచారని షర్మిల విమర్శించారు. బీజేపీ పెద్దలకు సలాం కొట్టడానికే బాబు పదే పదే హస్తినకు వెళ్తున్నారని ఆరోపించారు. అది నిజం కాదు, అనడానికి టీడీపీ వద్ద ఉన్న ఆధారాలేంటో చూపించాలని ఆమె ప్రశ్నించారు. "కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారు? గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా ?.." అని  షర్మిల టీడీపీ అధినేతను సూటిగా ప్రశ్నించారు. 

Also Read :- ఆంధ్రా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ..!

గతంలో అధికారంలో లేని సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అన్న టీడీపీ-జనసేన నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రశ్నించారు. "విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా ?  పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత  ఇచ్చారా ? రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా ?.." అని పలు సవాళ్లు విసిరారు.

బాబుగారు కళ్లు తెరవండి..!

అదే సమయంలో సంధర్భాన్ని బట్టి మనుషులను, ప్రజలను వాడుకోవడంలో బీజేపీ నైజం ఎలాంటిదో చెప్పేలా సెటైర్లు విసిరారు. "ఒడ్డు దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాటాక బోడి మ‌ల్ల‌న్న.." ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచింది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది.." టీడీపీ అధినేతను షర్మిల హెచ్చరించారు.

Also Read :- ఏపీ మహిళలకు గుడ్​ న్యూస్