విజయవాడ: వైఎస్ జగన్ తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని ఏపీ పీసీపీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని ఆమె మండిపడ్డారు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని జగన్ తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అని జగన్ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అని షర్మిల గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని షర్మిల కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, మహిళలపై దాడులు ఆగడం లేదని, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ సర్కార్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెల్టు షాపుల దందాను అరికట్టలేదని, 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదని, రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని పెదవి విరిచారు.
ALSO READ | షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే, ప్రతిపక్షం ఇస్తేనే వస్తామనడం సిగ్గు చేటని షర్మిల విమర్శించారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా కుంగిపోలేదని, మీ లెక్క హోదా కావాలని మారాం చేయలేదని ఆమె గుర్తుచేశారు.
26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామని, ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ అని షర్మిల చెప్పారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదని, హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రజా సమస్యలపై తమ గళం వినిపించారని తెలిపారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని, దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని గుర్తుచేశారు.
ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళండని, కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండని షర్మిల వైసీపీకి హితవు పలికారు. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండని, అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.