
జనసేన 11వ ఆవిర్భావ సభను పిఠాపురం నియోజికవర్గంలోని చిత్రాడలో ఘనంగా నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలిసభ కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సభలో మాట్లాడుతూ త్రిభాషా సూత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారతదేశానికి బహుభాషా విధానమే మంచిది అని.. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్. దేశ ఐక్యత కోసం బహుభాషా విధానం ఉండాలని అన్నారు. త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా.. ఓడినా అడుగు ముందుకేశామని.. జనసేన నిలబడటమే కాకుండా టీడీపీని కూడా నిలబెట్టిందని అన్నారు పవన్ కళ్యాణ్. ఛాలెంజ్ చేసిన తొడల్ని బద్దలుకొట్టామని అన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్ తో నిలబడి ఎన్డీయే కూటమిని నిలబెట్టమని.. దేశమంతా తనవైపు తిరిగి చూసిందని అన్నారు పవన్ కళ్యాణ్.
తనను తిట్టని తిట్టు లేదు..తనపై చేయని కుట్ర లేదని.. అన్నారు. 2019లో తాము ఓడినప్పుడు మీసాలు మెలేశారని.. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని అన్నారని.. వందశాతం స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించామని అన్నారు పవన్ కళ్యాణ్.ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామని.. ఓడిపోయినా కూడా అడుగు ముందుకేశామని అన్నారు.