ఇది వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడి: పవన్ కళ్యాణ్

ఇది వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడి: పవన్ కళ్యాణ్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. రంగరాజన్‌పై దాడి దురదృష్టకరమన్నారు. విషయం తెలిసి తాను తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలిపారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని అన్నారు.

"చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఇది దురదృష్టకరమైన ఘటన. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు. పోరాటం చేస్తున్నారు.."

"రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి.."

Also Read :- ఎవరీ వీర రాఘవరెడ్డి.. రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం ఏంటీ..?

"సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను శ్రీ రంగరాజన్ గారు నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి.." అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే..?

ఫిబ్రవరి 7న శుక్రవారం ఉదయం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగింది. రామరాజ్యం స్థాపన పేరిట ఏర్పాటైన ఓ ముఠా.. ఆయన ఇంటికెళ్లి దాడికి పాల్పడ్డారు. తమతో చేతులు కలపాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని వారు రంగరాజన్‌పై ఒత్తిడి చేశారని తెలుస్తోంది. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మెయినాబాద్ పోలీసులు ఇప్పటికే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.