2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పలు రంగాల్లో విశేష కృషిని అందించిన కళాకారులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులని అందించింది కేంద్రం. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి.
ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కి కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. తాజాగా ఇవాళ (జనవరి 26న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి X వేదికగా అభినందనలు తెలిపారు.
సినీ రంగం:
ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ గారు హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నారు.
గ్యాస్ట్రో ఎంట్రాలజీ:
ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా.డి.నాగేశ్వర్ రెడ్డి గారు పద్మ విభూషణ్ కు ఎంపికైనందుకు అభినందనలు.
ప్రజా ఉద్యమం:
ప్రజా ఉద్యమాల్లో శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఎం.ఆర్.పి.ఎస్. (MRPS) ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. శ్రీ మంద కృష్ణ మాదిగ గారు పద్మశ్రీకి ఎంపికైనందుకు అభినందనలు.
సాహిత్యం-విద్య విభాగం:
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన శ్రీ కె.ఎల్.కృష్ణ గారు, శ్రీ వి.రాఘవేంద్రాచార్య పంచముఖి గారికి అభినందనలు.
చివరగా ఈ ఏడాది 30 మంది మట్టిలో మాణిక్యాలాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అని పవన్ కల్యాణ్ అన్నారు. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు శ్రీ మిరియాల అప్పారావు గారికి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కిందని తెలిపారు పవన్.
సినీ విభాగంలో మరికొంత మందికి:
టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ శోభన కి కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది. నటి శోభన హీరోయిన్ గా మాత్రమే కాకుండా భరతనాట్యం డ్యాన్సర్ గా పలు ప్రదర్శనలు ఇచ్చింది. తమిళ్ హీరో అజిత్ కుమార్ కి పద్మభూషణ్ అవార్డు వరించింది. కర్ణాటక నుంచి కేజీయఫ్ మూవీ ఫేమ్ నటుడు, రైటర్ అనంత్ నాగ్ కి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక బాలీవుడ్ నుంచి అరజిత్ సింగ్ (పద్మశ్రీ), శేఖర్ కపూర్ (పద్మభూషణ్) తదితరులకి అవార్డులు లభించింది.
పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు!
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 25, 2025
🔸అయిదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ గారు - హిందూపురం…