
పిఠాపురం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ ఘటన చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులపై గ్రామ బహిష్కరణ విధిస్తూ అగ్రవర్ణాల కుల పెద్దలు హుకుం జారీ చేశారు. గ్రామంలో ఉన్న షాపులు, హోటళ్లలో ఏ విధమైన వస్తువులను దళితులకు విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు హుకుం జారీ చేశాయి.
ఏప్రిల్16వ తారీఖున గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి దగ్గర కరెంటు పని చేస్తూ విద్యుత్ ఘాతానికి గురై పల్లపు సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. పల్లపు సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా సుమారు 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం జరిగింది. తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు సమావేశమయ్యారు.
దళితులను దూరం పెట్టాలని, దళితులకు ఏ విధమైన సాయం చేయకూడదని తీర్మానించారు. గ్రామంలో ఉన్న దళితులకు ఏ విధమైన వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఈ తీర్మానం మీరితే వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులను అగ్ర కుల పెద్దలు హెచ్చరించారు. దీంతో.. నిన్నటి నుంచి దళితులకు ఏ విధమైన వస్తువులను, తినుబండారాలను అమ్మకుండా షాపులు యజమానులు అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. ఇప్పటికీ కుల అహంకార భావనతో ఆంధ్రాలోని గ్రామాలు రగిలిపోతుండటంపై నెటిజన్లు మండిపడ్డారు.