ఆపద్బాంధవుడు అన్నయ్య..చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ప్రపంచంలోనే ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేడు ఆగస్ట్ 22న తన పుట్టినరోజు సందర్బంగా ప్రపంచ నలుమూలల నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందుతున్నాయి.

తాజాగా చిరు తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ మీద ఒక లేఖని విడుదల చేయడం కూడా జరిగింది. ఆపద్బాంధవుడు అన్నయ్య అంటూ తనలోని బంధాన్ని..ఆ బలాన్ని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 

Also Read:-విశ్వంభర విజృంభణం..త్రిశూలంతో రుద్రనేత్రుడిలా చిరంజీవి

"నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో  సహాయాలు గుప్తంగా  మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!

గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవుణ్ని మనసారా  కోరుకుంటున్నాను" అని పవన్ తెలిపారు.