హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం ...సీఎం రేవంత్ రెడ్డి చర్యలు కరెక్టే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్

  •     ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని వెల్లడి 
  •     హైడ్రా లెక్క ఏపీలోనూ ఆక్రమణలు తొలగించాలి: షర్మిల 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చేపట్టిన చర్యలు మంచివేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయమని కొనియాడారు. బుధవారం ఏపీలోని అమరావతిలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. “భవనాలు నిర్మించిన అనంతరం కూలగొట్టడం ద్వారా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. నిబంధనల‌‌‌‌‌‌‌‌ ప్రకారం నిర్మాణాలు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి. పేదల నిర్మాణాలు కూల్చే సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. 

 ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రూల్స్ ఖరారు చేసినా వాటిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. నదులు, చెరువులు, కాలువలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలి. అధికారులు అనుమతి ఇచ్చే సమయంలో అన్ని పరిశీలించిన తర్వాతే పర్మిషన్ ఇవ్వాలి. స్థానిక నేతలు ఆక్రమణలను ప్రొత్సహించకూడదు. మరో పది, పదిహేనేండ్లకు మరో ప్రభుత్వం వచ్చినా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు. 

ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి : షర్మిల 

తెలంగాణలోని హైడ్రా మాదిరి ఏపీలోనూ ఆక్రమణలు తొలగించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని, ఇందుకు హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు అవసరమని అన్నారు. ‘‘విజయవాడ వరదలకు బుడమేరే కారణం. వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలి. ఈ బాధ్యత సీఎం చంద్రబాబు మీదే ఉంది. ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించలేదు. వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించాలి. నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం రూ.లక్ష సాయం చేయాలి’’ అని షర్మిల డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.