- బెనిఫిట్‌షోకు అర్జున్ పోకుండా ఉండాల్సింది: పవన్ కల్యాణ్
- సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి బాధాకరం
- ఈ విషయంలో సీఎంను, పోలీసులను తప్పుపట్టలేం
- చట్టం దృష్టిలో అందరూ సమానమే
- బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది
- మానవతా దృక్పథం లోపించడం వల్లే గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చింది
- ఏపీలో వైసీపీ సర్కార్లా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించలేదని వ్యాఖ్య
హైదరాబాద్ , వెలుగు: సంధ్య థియేటర్ఘటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు కరెక్టే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ స్థానంలో తాను ఉన్నా అలాగే చేసేవాడినని చెప్పారు. సోమవారం ఏపీ సెక్రటేరియెట్‌లో పవన్ కల్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి కలిచివేసింది. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. ఈ విషయంలో సీఎం రేవంత్‌ను, పోలీసులను తప్పుపట్టలేం. పోలీసులు పర్మిషన్ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ బెనిఫిట్‌షో కు వెళ్లకుండా ఉండాల్సింది. ఘటన జరిగిన మరుసటి రోజు బాధితులను సినిమా టీం తరఫున ఎవరైనా పరామర్శించి భరోసా ఇవ్వాల్సింది. అలా చేయకపోవడం వల్ల గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చింది’’ అని పేర్కొన్నారు.
రేవంత్‌ను తప్పుపట్టలేం..
పుష్ప సినిమా బెనిఫిట్‌షోకు, టికెట్ల రేట్ల పెంపునకు సీఎం రేవంత్‌రెడ్డి చాన్స్ ఇచ్చారని, ఆయనను ఎలా తప్పు పడతామని పవన్‌కల్యాణ్ అన్నారు. ‘‘అర్జున్ తన పేరును గుర్తుపెట్టుకోకపోవడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి కావాలని అలా చేశారని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి వీటన్నింటికీ మించిన నాయకుడు. కింది నుంచి ఎదిగారు. ఇక్కడ వైసీపీ తరహాలో అక్కడ తెలంగాణ సర్కారు వ్యవహరించలేదు. సినిమా ఇండస్ట్రీని రేవంత్ప్రోత్సహిస్తున్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో అల్లు అర్జున్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఎవరున్నా రేవంత్ విధానం ఒకటే. ఇలాంటి విషయాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఒకదశలో రేవంత్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అంతెందుకు ఆయన స్థానంలో నేనున్నా అలాగే చేస్తాను’’ అని వ్యాఖ్యానించారు.
అందుకే సినిమా థియేటర్లకు వెళ్లట్లే..
ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సినిమా థియేటర్లకు వెళ్లడం లేదని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నాడంటే అభిమానులు ఎగబడతారు.. అభివాదం చేయకపోతే.. పొగరు. బలుపు అని అందరూ చర్చ పెడతారు. అల్లు అర్జున్అందుకే అభివాదం చేసి ఉంటారు. థియేటర్‌కు వెళ్లి తన నటనను ప్రేక్షకులు ఎలా రిసీవ్చేసుకుంటున్నారో చూడాలని ప్రతి కళాకారుడు అనుకుంటాడు. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేనిది. కానీ ఇలాంటివి వద్దనే నేను సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశా. గతంలో చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ కూడా అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరైనా గుర్తుపట్టినప్పుడు సమస్య వస్తుంది”అని వ్యాఖ్యానించారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు. వచ్చే నెల 4, 5వ తేదీల్లో విజయవాడలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్, మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్‌తో దిల్ రాజు చర్చించారు. సినిమా టికెట్ల రేట్ల అంశంపైనా మాట్లాడినట్టు తెలిసింది.
మానవతా దృక్పథం లోపించింది..
రాంచరణ్, అల్లు అర్జున్ చిన్నతనం నుంచి రేవంత్‌రెడ్డికి తెలుసని, అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయినా చట్టాన్ని కాపాడా ల్సిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ప్రజలకు సమా ధానం చెప్పాల్సి ఉంటుందని, అందుకే ఆయన చట్ట ప్రకారం నడుచుకున్నారని అన్నారు. ‘‘అల్లు అర్జున్ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ మహిళా అభిమాని రేవతి చనిపోవడం నన్ను కలిచివేసింది. బెనిఫిట్ షోకు వెళ్లొద్దని స్టాఫ్ అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి వివరించాల్సింది. కానీ అలా చేయకపో వడం వల్ల సమస్య వచ్చింది. ఒకవేళ పోలీసులు అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. మరుసటి రోజైనా అల్లు అర్జున్‌గానీ, ఆయన తరుపున సినిమా టీమ్‌గానీ వెళ్లి బాధిత కుటుంబానికి మేమున్నామని భరోసా ఇవ్వాల్సింది. ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. ఈ వ్యవహారంలో సినిమా టీమ్ తప్పు కూడా ఉంది. వారు స్పందించకపోవడం వల్ల, కనీసం అల్లు అర్జున్ఎలా స్పందించాలో చెప్పకపోవడం వల్ల హీరో అర్జున్ఒక్కడే దోషిగా మిగిలారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మొత్తం టీమ్‌లో మానవతా దృక్పథం లోపించింది’ అని అన్నారు.