రేవంత్​ను కలిసిన పవన్

  • ప్రజల కష్టాలు తీర్చేందుకు రేవంత్ కృషి అభినందనీయమంటూ ట్వీట్

హైదరాబాద్, వెలుగు:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచనా విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని ఆయన కొనియాడారు. ఇటీవల ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించారు.

ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం బుధవారం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసంలో కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. అనంతరం పవన్ ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

తెలంగాణలో వరద బాధితుల కోసం రూ.కోటి చెక్కును సీఎంఆర్ఎఫ్ కింద అందజేసినట్లు తెలిపారు. రేవంత్ అప్యాయంగా స్వాగతించారని, ప్రజల కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడుతూ. వారు భేటీ అయిన ఫొటోలను పవన్ షేర్ చేశారు.