హైదరాబాద్, వెలుగు:సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేయడం ఆవేదనకు గురి చేసిందని, ఇది దుర్మార్గమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మహాపచారం, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతానికి సంబంధించిన వారైనపట్టికీ సామూహికంగా కాపాడుకోవాలని, ఈ బాధ్యతను ప్రభుత్వాల మీదనో, పోలీసుల మీదనో వేసి మనం బాధ్యత నుంచి దూరంగా ఉండరాదని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తే అది విపరీత పోకడలకు దారి తీస్తుందని, అదుపు తప్పుతుందన్నారు. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమని ఆయన అన్నారు. అందుకే తిరుపతిలో జరిగిన సభలో వారాహి డిక్లరేషన్ లో చెప్పానని, ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.