ఏపీ పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయబోమని.. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కామెంట్ చేయనని అన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారణ చేస్తామని అన్నారు.
వైసీపీ హయాంలో జరిగిన టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనపై కూడా స్పందించారు ద్వారకా తిరుమలరావు. గతంలో టీడీపీ ఆఫీసు మీద జరిగితే... కేసు పెట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిందితులను అరెస్టు చేయలేదని అన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ వాడలేదని అన్నారు. మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతోందని.. డీజీపీ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని స్పష్టం చేశారు.
Also Read :- కేంద్రమంత్రి కుమారస్వామిపై ఎఫ్ఐఆర్
మిగిలిన వారిపై విచారణ చేసి త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు డీజీపీ. కాగా.. ఏపీలో ఆడపిల్లలపై వరసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను హోంమినిస్టర్ అయితే... పరిస్థితులు వేరుగా ఉంటాయని... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావప్రకటనా స్వేచ్ఛ అంటున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హోంమంత్రి అనిత సహా.. కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పవన్ కామెంట్స్ చేయటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.