ఏపీ డీజీపీ హైదరాబాద్‌‌‌‌ లోని పార్కు స్థలాన్ని ఆక్రమించారు: GHMC

ఏపీ డీజీపీ హైదరాబాద్‌‌‌‌ లోని పార్కు స్థలాన్ని ఆక్రమించారు: GHMC
  • నోటీసుకు వారం గడువు ఇవ్వాలని కోర్టు ఆదేశం

వెలుగు: ఆంధ్రప్రదేశ్‌‌‌‌ డీజీపీ రామ్‌ ప్రవేశ్‌‌‌‌ ఠాకూర్‌ హైదరాబాద్‌‌‌‌ ప్రశాసన్‌‌‌‌నగర్‌ లోని జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్నారని, తాము నోటీసు ఇచ్చాకే సదరు పార్కు స్థలంలోని అక్రమ నిర్మాణాల్ని తీసేశారని రాష్ట్ర హైకోర్టుకు జీహెచ్ఎంసీ తెలిపింది. పార్కును ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టడమే కాకుండా, సొంత స్థలంలో నిర్మాణానికి తీసుకున్న ప్లాన్‌‌‌‌ అనుమతిని సైతం మార్చేసి నిర్మాణం చేశారనే అభియోగంపై నోటీసు ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ తరఫున లాయర్‌ వెంకటేశ్వర్‌ రావు హైకోర్టు దృష్టికి తెచ్చారు. నోటీసు ఇచ్చిన జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ మంగళగిరి వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిల్ పై మంగళవారం హైకోర్టు విచారించింది.

ఏపీ డీజీపీని ఆక్రమణదారుడిగా పేర్కొంటూ జీహెచ్ఎంసీ 24 గంటల వ్యవధితో కూడిన నోటీసు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కనీస వ్యవధి వారం రోజులైనా ఉండాలని స్పష్టం చేస్తూ యథాతథస్థితి ని (స్టేటస్‌‌‌‌ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘కేవలం 24 గంటల సమయం ఇచ్చి నిర్మాణాల్ని కూల్చేస్తామని నోటీసు ఇవ్వడం సబబు కాదు. నోటీసుకు కనీస గడువు వారం రోజులు ఉండాలి. ఎవరో చెబితే గానీ ఆక్రమణల గురించి తెలియదా? నిర్మాణాలు కూడా జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రాలేదా?’ అని న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌ రాఘవేంద్ర సింగ్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ టి.అమర్‌ నాథ్‌ గౌడ్‌‌‌‌తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ప్రశ్నించింది. వారం రోజుల గడువుతో తిరిగి నోటీసు ఇస్తామని జీహెచ్ఎంసీ లాయర్‌ చెప్పారు. విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది.