ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024 మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్ అన్నారు.విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో చెప్పాలన్నారు.
రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కార్యక్రమాలు చేపడుతున్నామన్న సీఎం జగన్ ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 15 వేల ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.కోటీ 60 లక్షల ఇళ్లకు వెళ్లి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, ఫ్యామిలీ డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజల పట్ల బాధ్యతతో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ప్రజలకు ఎంత ఎక్కువ చేరువ చేస్తే అంత ఎక్కువగా ఆ ఫలాలు అందుతాయన్నారు. వైద్యం నుంచి మందుల వరకు అన్ని ఉచితంగా ప్రజలకు అందించేలా ప్రజా ప్రతినిధులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అదేవిధంగా జనవరి నెల నుంచి పింఛన్ రూ.3 వేలు అందిస్తామని వెల్లడించారు.ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
బీదలు, బడుగు,బలహీన వర్గాలు తమ కుటుంబం అని భావించి ప్రతి అడుగు వేసినట్టు చెప్పారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఇంతకు ముందు చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. నామినేటేడ్ పదవుల్లో 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామని, అదే విధంగా స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశామని సీఎం పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరగొచ్చాని, మన లక్ష్యం క్లీన్ స్వీప్ చేయడమే అని నాయకులను ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు.
ALSO READ : OTTలోకి విశాల్ మార్క్ ఆంటోనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమ ఉద్దేశం ఏమిటో సీఎం జగన్ వివరించారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్ రావాలని, వైఎస్సార్ సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే మరొకటి లేదని సీఎం తెలిపారు.