మాకు చచ్చి పోవాలనిపిస్తోంది: ఏపీ ఇంజినీరింగ్ విద్యార్థినుల ఆడియోలు వైరల్

మహిళలు అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని ఒక మహానుభావుడు అన్నారు. కానీ వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తుంటే అర్థరాత్రి రోడ్డుపై దేవుడెరుగు.. పుట్టింట్లోనూ, మెట్టినింట్లోనూ, విద్యనభ్యసించే కళాశాలలోనూ స్వేచ్ఛగా, భద్రంగా బతకలేకపోతున్నారు. ప్రతి క్షణం దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ విద్యార్థిని సహాయంతో గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీసీ కెమరాలు అమర్చిన ఓ ప్రబుద్ధుడు.. తోటి విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించాడు. దాదాపు 300 మంది విద్యార్థినులు ఉన్న కాలేజీ లేడీస్ హాస్టల్‌లో ఈ ఘటన విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

చచ్చి పోవాలనిపిస్తోంది

వీడియోలు రికార్డు చేసినట్లు వార్తలు గప్పుమనడంతో విద్యార్థినులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. వీడియోలు బయటకొస్తే సమాజంలో తమ పరిస్థితి ఏంటని.. ఎలా తలెత్తుకు తిరగగలమని వాపోతున్నారు. తల్లిదండ్రులకు, గ్రామస్థులకు తమ మొహాలు ఎలా చూపించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను తోటి విద్యార్థినులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. విద్యార్థినులు తోటి విద్యార్థినులతో తమ బాధను పంచుకుంటున్న ఆడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

ఫైనల్ ఇయర్ చదువుతున్న నిందితుడు

ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ అనే విద్యార్థి అదే కాలేజీలో ఫైనల్ ఇయర్‌ చదువుతున్నాడు. ఇప్పటికే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతని నుంచి ల్యాప్‌టాప్, మొబైల్‌ స్వాధీనం చేసుకున్నారు. వాటిలోనే విద్యార్థినులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు సమాచారం. డబ్బుకు ఆశపడి నిందితుడు తోటి విద్యార్థులకు వీడియోలు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. అలా వీడియోలు నలుగురి చెంతకు చేరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.