తాడేపల్లి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల లడ్డూ వివాదంపై వివరణ ఇస్తూ 20 మంది ముఖ్యమంత్రులను తన ‘ఎక్స్’ ఖాతాలో ట్యాగ్ చేశారు. ఆ 20 మంది ముఖ్యమంత్రులు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన వాళ్లే కావడం ఇక్కడ ట్విస్ట్. 20 మంది ముఖ్యమంత్రులను ట్యాగ్ చేసి ‘‘తిరుమల లడ్డూ వివాదంపై నిజాలు ఇవిగో’’ అంటూ తాను రాసిన లేఖను వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
Kind Attention: Please take note of the facts presented in this letter addressed to the Honorable Prime Minister Narendra Modi Ji regarding the severe pain caused to the religious sentiments of Hindu devotees https://t.co/TI3vgkaZ0e. @myogiadityanath @PemaKhanduBJP @himantabiswa…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 23, 2024
అంతేకాదు.. తాను ఈ వివాదంపై మాట్లాడిన వీడియో బైట్ను, ల్యాబ్ రిపోర్ట్స్ను కూడా పోస్ట్ చేశారు. ఇంత మంది ముఖ్యమంత్రులను ఒకేసారి జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్యాగ్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మొదలుకుని, కేంద్ర మంత్రులకు, టీటీడీకి, పలు హిందూ ధార్మిక సంస్థలకు, మీడియా సంస్థలకు, తాజాగా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులను జగన్ ఇప్పటివరకూ ట్యాగ్ చేయడం గమనార్హం.
ALSO READ | తిరుపతి లడ్డూ లొల్లి: ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించి.. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సిట్ : ఏపీ సీఎం చంద్రబాబు
లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా మరింత అగ్గి రాజేశాయి. లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో శ్యామల రావు కూడా స్పందించారు. లడ్డూల తయారీ కోసం తిరుమలకు వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని, భారీగా కల్తీ జరిగినట్టు ల్యాబ్ టెస్ట్లో స్పష్టమైందన్నారు. జంతువుల కొవ్వు కలిసినట్టు తేలిందని అన్నారు. ప్రభుత్వ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు.
లడ్డూ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. పిటిషన్లపై విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అడకేట్ ద్వారా జర్నలిస్ట్ సురేశ్ చౌహాన్కే సీజేఐకి లేఖ రాశారు. ఏపీ రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లటంతో మరింత కాక రేపుతోంది.