టీడీపీకి షాక్: ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా.. పార్టీ సభ్యత్వానికి కూడా..

టీడీపీకి షాక్: ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా.. పార్టీ సభ్యత్వానికి కూడా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా జీవీ రెడ్డి ప్రకటించారు. రాజీనామా చేస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని జీవీ రెడ్డి ప్రకటించడంతో టీడీపీలో కలకలం రేగింది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని కూడా జీవీరెడ్డి కుండబద్ధలు కొట్టారు.

ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ఐఏఎస్ దినేష్ కుమార్ వ్యవహారంపై కొన్ని రోజులుగా చైర్మన్ జీవీ రెడ్డి అసహనంగా ఉన్నారు. ఫైబర్ నెట్ లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించాలన్న ప్రతిపాదనపై ఇద్దరి మధ్య వివాదం రేగింది. అదే విధంగా.. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలయినా ఒక్క కొత్త ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వకపోవడం, ఒక్క రూపాయి అదనంగా సంపాదించకపోవడంపై విమర్శలొచ్చాయి. 

ఇదే సమయంలో.. నెట్ వర్క్ సిగ్నల్స్ దారుణంగా పడిపోయాయని కేబుల్ ఆపరేటర్లు మొత్తుకుంటున్నా ఎండీ, ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగంగానే జీవీ రెడ్డి తన ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు. అయితే.. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని, ఆ సమావేశంలోనే వెల్లడించిన జీవీ రెడ్డి వారం రోజులు కాక ముందే తన పదవికి, టీడీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.