ఎన్నికల వేళ.. సాగర్ డ్యామ్​పై డ్రామా

  • గురువారం ఉదయం 700 మంది పోలీసులతో డ్యామ్​పైకి ఏపీ ఇరిగేషన్ ఆఫీసర్లు
  • రక్షణ గేట్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కుడి కాల్వ ద్వారా ఏపీకి నీటి తరలింపు

హాలియా, వెలుగు: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది గంటల ముందు, గురువారం తెల్లవారుజామున ఉన్నట్టుండి నాగార్జున సాగర్​డ్యామ్​పై ఏపీ ఇరిగేషన్​ ఆఫీసర్లు, ఏకంగా 700 మంది పోలీసులతో కలిసి హైడ్రామా చేశారు. ప్రాజెక్ట్​ పరిధిలోని 26వ గేటు వరకు తమ ఆధీనంలోకే వస్తుందని చెప్తూ దౌర్జన్యంగా13 వ గేటు వద్ద కు చేరుకున్నారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో డ్యామ్​పై బారికేడ్లు, ఇనుప కంచెతో అడ్డుగోడ కట్టి కుడి కాల్వ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని  ఆ రాష్ట్రానికి తరలించుకొని వెళ్లారు.

రక్షణ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం  చేసి.. 

గురువారం తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యామ్ పై ఉద్రిక్తత నెలకొంది. సుమారు2 గంటల ప్రాంతంలో ఏపీ ఇరిగేషన్ ఆఫీసర్లు, పోలీస్​బలగాలను వెంటబెట్టుకొని కుడి ప్రధాన కాలువ నుంచి తెలంగాణ వైపు దూసుకొచ్చారు. ఏపీ వైపు ఏర్పాటు చేసిన రక్షణ గేట్లను ధ్వంసం చేసి, సీసీ కెమెరాలను పగులగొట్టారు. 13వ గేట్ వరకు చేరుకున్న ఏపీ ఆఫీసర్లు, పోలీసులను ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు అడ్డుకోవడంతో వాళ్లపైనా దాడికి దిగారు. సెల్​ఫోన్లను పగుల గొట్టారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. మొదట మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో, తర్వాత నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు నేతృత్వంలో ఏపీ అధికారులతో చర్చలు జరిపారు. కానీ చర్చలు ఫలించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోవద్దని ఈసీ ఏపీ ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిసింది.

 నీటి పంపకాలపై రాజీపడం: మంత్రి జగదీశ్​రెడ్డి 

సూర్యాపేట, వెలుగు: తెలంగాణ ప్రజలు తమ హక్కు వదులుకోవడానికి సిద్ధంగా లేరని, నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సాగర్ వివాదంపై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ నీటి విషయంలో మొదటి నుంచి ఏపీ మొండిగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల్లో కృష్ణా నీటి సమస్య కొనసాగుతుందని పేర్కొన్నారు. కేంద్రం కృష్ణా నీటి పంపకాలలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వాట నుంచి ఒక్క చుక్క కూడా పోనీయబోమని  తేల్చి  చెప్పారు. నీటి వివాదం అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు తమకు లేదన్నారు.

అక్రమంగా కుడికాల్వకు 2 వేల క్యూసెక్కుల నీళ్లు 

ఓవైపు చర్చలు జరిపినా, మరోవైపు ఈసీ ఆదేశించినా ఏపీ ఆఫీసర్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. తీవ్ర నిర్బంధం నడుమ నాగా ర్జున సాగర్ ప్రాజెక్టు  కుడి కాల్వ ద్వారా గురువారం ఉదయం 2 వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా విడుదల చేశారు. స్పందించిన తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఏపీకి వెళ్లే పవర్ సప్లై నిలిపివేశారు. నాగార్జున సాగర్​ డెడ్​స్టోరేజీలో ఉన్నందున అటు తెలంగాణలోని ఎడమకాలువకుగానీ, అటు ఏపీ వైపు కుడికాలువకు నీటిని విడుదల చేయడం లేదు. నీళ్లే లేని టైంలో, సరిగ్గా ఎన్నికల రోజు ఏపీ ఆఫీసర్లు, పోలీసులు, తెలంగాణ పోలీసుల హైడ్రామాపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెంటిమెంట్​ను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్​పెద్దలు ఈ ప్లాన్​ చేశారని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు.

 2015లోనూ సేమ్​ సీన్​.. 

2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ పై  ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య  ఇలాంటి గొడవే జరిగింది.  రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర  తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అప్పట్లో తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్‌‌‌‌గేట్ల స్విచ్‌‌‌‌రూమ్‌‌‌‌ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేదు నాగార్జున సాగర్ అంశంపై మాట్లాడను: హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల ను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని మంత్రి  హరీశ్​ రావు అన్నా రు. గురువారం సిద్దిపేట పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడా రు. పోలింగ్ జరుగుతున్నందున ఎన్నిక ల కమిషన్ నిబంధనలకు లోబడి నాగా ర్జున సాగర్ అంశంపై మాట్లాడబోనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఈ విషయాల్లో  ఏమాత్రం తగ్గరని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు పాజిటివ్ ఓటింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా వుంటుందో, అభివృద్ది లో ముందుకు పోతుందో విజ్ఞులైన ఓటర్లకు తెలుసని వెల్లడించారు. 

పదేండ్ల నుంచి నిద్రపోయినవా కేసీఆర్​పై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఫైర్​

నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్​ నీటి వాటాలను అడ్డంపెట్టుకొని డ్యామ్ డ్రామాకు కేసీఆర్ తెరలేపారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం నల్గొండలో మాట్లాడుతూ..పదేండ్ల నుంచి కుంభకర్ణుడి లాగా నిద్రపోయి ఇప్పుడు నీటి హక్కుల కోసం మాట్లాడడం విడ్డూరమన్నారు. రాజ్యసభ, లోక్​సభలో బీఆర్ఎస్​ ఎంపీలు ఏనాడు నీటి హక్కుల కోసం కొట్లాడ లేదని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించి మోదీతో కొట్లాడాల్సి ఉండెనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ ఈ డ్యామ్ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.