పాపికొండల టూరిజం బోట్లకు రేట్ల షాక్ ..టూరిస్టులపై ఎఫెక్ట్ ?

పాపికొండల టూరిజం బోట్లకు రేట్ల షాక్ ..టూరిస్టులపై ఎఫెక్ట్ ?
  • ధరలు పెంచిన ఏపీ అటవీశాఖ 
  • పర్యాటకులు వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు తింటూ జంతువులకు ప్రాణహాని
  • నేషనల్ పార్కులో పర్యావరణానికి ముప్పంటూ అటవీ అధికారుల ఆరోపణ
  • ఆందోళన వ్యక్తం చేస్తోన్న భద్రాచలం బోట్ల యజమానులు
  • వీళ్లు కూడా ధరలు పెంచితే టూరిస్టులపైన ఎఫెక్ట్ 

భద్రాచలం, వెలుగు: పాపికొండల టూరిజం బోట్ల యజమానులకు ఏపీ అటవీశాఖ షాక్ ఇచ్చింది. పాపికొండల నేషనల్​పార్కులో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందంటూ.. దీంతో ఎన్విరాన్ మెంటల్ మెయింటెనెన్స్ చార్జీలను పెంచాలని సీసీఎఫ్ నిర్ణయించి బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న పోచవరంలో పర్యటించిన ఆంధ్రా సీసీఎఫ్​ మూర్తి అడవిలో వ్యర్థాలు  భారీగా పేరుకుపోయినట్లుగా గుర్తించారు. ఆ మేరకు రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుని ఆదేశించారు. 

 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రాలోని విలీనమైన వీఆర్​పురం మండలం పోచవరం నుంచి నిత్యం ఏపీ టూరిజం లాంచీ–1, ప్రైవేటు లాంచీలు – 19 టూరిస్టులతో పాపికొండలకు వెళ్తాయి. అయితే... లాంచీలు ఎక్కువగా భద్రాచలంకు చెందినవారివే. కాగా ముందుగా టూరిస్టులు భద్రాచలం నుంచి ప్రైవేటు వెహికల్స్ లో పోచవరం వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో పాపికొండల టూర్ కు వెళ్తుంటారు. సెలవు రోజుల్లో ఎక్కువగా, సాధారణ రోజుల్లో తక్కువగా పర్యాటకులు వస్తుంటారు. 

అయితే ప్రయాణికులు ప్లాస్టిక్ వాడటం వల్ల నేషనల్​పార్కు పొల్యూషన్ కు గురవుతుండగా.. ప్లాస్టిక్ ను తిని అడవి జంతువులు రోగాల బారిన పడుతున్నాయి. పెద్ద శబ్ధాలతో వాహనాలు అటవీ ప్రాంతంలో వెళ్తుండడంతో జంతువులకు ప్రమాదం పొంచి ఉందని ఏపీ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆరోపిస్తోం ది. 

గోదావరి నదితో పాటు, అటవీ ప్రాంతంలో టూరిస్టులు వదిలేసే ప్లాస్టిక్​తదితర వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పేర్కొంటుంది.  బోట్ల ఓనర్లకు ఇచ్చిన నోటీసుల్లో ఇలాగే పేర్కొంది. అంతేకాకుండా వ్యర్థాలను తొలగించడానికి నిధులు తమ శాఖ వద్ద లేనందున ఎన్విరాన్​మెంట్ మెయింటెనెన్స్ చార్జెస్​కింద వసూలు చేసే రేట్లను పెంచుతున్నట్లు కూడా బోటు ఓనర్లకు ఇచ్చిన ఫైనల్​నోటీసుల్లో తెలిపింది. 

భారీగా పెంచిన చార్జీలు

గతంలో టూరిస్టుల్లో పెద్దలకు రూ.2, పిల్లలకు రూ.1, బోటుకు రూ.100 చొప్పున నెలకు వసూలు చేసి ఏపీ అటవీశాఖ పేరిట చలానా ఇచ్చేవారు. ప్రతీ నెల ఆ శాఖ ఖాతాలో వేసేవారు.  పోచవరంలో  ఆంధ్రా సీసీఎఫ్​ మూర్తి పర్యటించిన నేపథ్యంలో అడవిలో వ్యర్థాలు  భారీగా పేరుకుపోయినట్లుగా గుర్తించారు. లోకల్ స్టాఫ్​సైతం వాటిని తొలగించేందుకు బడ్జెట్​ లేదంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్విరాన్ మెంటల్ మెయింటెనెన్స్ చార్జీలను పెంచాలని సీసీఎఫ్ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు.  

ఒక లాంచీలో 50 మంది ప్రయాణిస్తే నెలకు రూ.2500,100 మంది ఉంటే రూ.4 వేలు, అంతకు మించి ఉంటే రూ.6వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించారు. అంతేకాకుండా పోచవరం వరకు పాపికొండల నేషనల్ పార్కులోకి ప్రవేశించే లైట్ వెహికల్​ రూ.50, హెవీ వెహికల్​ రూ.100, డిజిటల్​, ప్రొఫెషన ల్​ కెమెరాలకు రూ.500 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు నోటీసుల్లో తెలిపారు. ఇప్పటి వరకు 2002లో నిర్ణయించిన రేట్ల ప్రకారం చెల్లించారని, 2024 నవంబరు నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చినట్లుగా నోటీసుల్లో వెల్లడించారు. 

 బోట్ల యజమానుల ఆందోళన

అటవీశాఖ నిర్ణయంతో పాపికొండల బోట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ బోట్లు భద్రాచలంకు చెందినవే. పర్యాటకులు కూడా వందశాతం ఇక్కడే నుంచే పాపికొండలు చూసేందుకు వెళ్తుంటారు. ఇక కరోనా కారణంగా ఏండ్ల పాటు తిరగలేదని, కెచ్చలూరు లాంచీ మునక ఘటనతో రెండేండ్ల పాటు ఆపేశారని, తద్వారా తాము తీవ్రంగా నష్టపోయామని బోట్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టూరిస్టులు సంఖ్య గతంలో కంటే తక్కువగా ఉందని, అంత రేట్లు చెల్లించలేమంటున్నారు.  ఏపీ అటవీశాఖ తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నా రు. బోట్ల ఓనర్లంతా సీసీఎఫ్​ను కలిసేందుకు వెళ్లగా..  తాజాగా ప్రకటించిన చార్జీలే ఫైనల్ అంటూ చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ప్రత్నామ్నాయం లేక బోట్ల ప్యాకేజీ రేట్లు పెంచాలని భావిస్తున్నారు. దీని ప్రభావం టూరిస్టులపైనా పడనుంది.