TCS News: జాక్‌పాట్ కొట్టిన టీసీఎస్.. 99 పైసలకే 21 ఎకరాలు, ఏపీ సర్కార్ సంచలనం..

TCS News: జాక్‌పాట్ కొట్టిన టీసీఎస్.. 99 పైసలకే 21 ఎకరాలు, ఏపీ సర్కార్ సంచలనం..

AP News: దేశంలోని ఐటీ సేవల రంగంలో దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ప్రస్తుతం జాక్ పాట్ కొట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వం విశాఖలో కంపెనీ ఏర్పాటు కోసం 21.16 ఎకరాల స్థలాన్ని కేవలం 99 పైసల లీజుకు అందించాలని నిర్ణయించింది. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో టీసీఎస్ భారీ పెట్టుబడికి అంగీకరించిన వేళ అందుకు అవసరమైన భూ కేటాయింపులను చంద్రబాబు సర్కార్ పూర్తి చేసింది.

వాస్తవానికి టీసీఎస్ కంపెనీ ఏపీలో రూ.వెయ్యి 370 కోట్లను కొత్త డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటుకు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా రానున్న కాలంలో 12వేల మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. విశాఖ నగరంలోని రిషికొండ ఐటీ హిల్ ప్రాంతంలో ప్రస్తుతం టీసీఎస్ కు స్థల కేటాయింపులు జరిగాయి. నగరంలోని కీలక ప్రాంతంలో టాటాలకు ప్రభుత్వం స్థలాన్ని అందించింది. వాస్తవానికి గత ఏడాది నవంబర్ నుంచి చర్చలు కొనసాగగా.. ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ చర్చలు కొలిక్కి వచ్చాయి. రానున్న 3-4 నెలల కాలంలో కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించవచ్చని మంత్రి లోకేష్ వెల్లడించారు. 

గతంలో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాటా మోటార్స్ కంపెనీ తన నానో ప్లాంటును పశ్చిమ బెంగాల్ నుంచి తరలించాలని చూస్తున్న సమయంలో గుజరాత్ ప్రభుత్వం కేవలం 99 పైసలకే స్థలాన్ని లీజుకు అందించింది. దీంతో టాటా మోటార్స్ ప్లాంట్ సనంత్ ప్రాంతానికి తన కార్ల తయారీని మార్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతం తయారీ రంగంలో పెద్ద అభివృద్ధిని సాధించింది. అచ్చం అదే తరహాలో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం టీసీఎస్ ఏర్పాటుకు భూకేయింపులు చేయటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 

అయితే ప్రస్తుతం ఏపీ సర్కార్ తన చర్యల ద్వారా ఐటీ పరిశ్రమను స్వాగతించటానికి తాము ఎంత చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. భారీగా పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందిపుచ్చుకోవాలని కంపెనీ నిర్ణయించింది. పెద్ద సంస్థలను రాష్ట్రానికి ఆకట్టుకోవటానికి ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను అందిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.