సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోడ కూలి మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున అందించనున్నట్టు తెలిపింది.  మంగళవారం (ఏప్రిల్ 29) రాత్రి ఆలయంలోని రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని సూచించారు. 

రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం:

సింహాచలం దుర్ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. అదేవిధంగా గాయపడినవారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఆదేశించారు. 

భక్తులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం: వైఎస్ జగన్

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా గోడ కుప్పకూలి భక్తులు చనిపోవడంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.