నాగార్జున సాగర్, శ్రీశైలంలో తెలంగాణ వాటా 121 టీఎంసీలే

నాగార్జున సాగర్, శ్రీశైలంలో తెలంగాణ వాటా 121 టీఎంసీలే
  • కేడబ్ల్యూడీటీ 2కు సమర్పించిన అఫిడవిట్​లో ఏపీ వాదన
  • గోదావరి డైవర్షన్​లో 45 టీఎంసీలు ఏపీవేనని వెల్లడి
  •   2 వారాల్లోగా అఫిడవిట్ ఇవ్వాలని తెలంగాణకు ట్రిబ్యునల్ ఆదేశం
  •  వచ్చే నెల 6 నుంచి క్రాస్​ ఎగ్జామినేషన్

హైదరాబాద్, వెలుగు :  శ్రీశైలం, నాగార్జునసాగర్​ప్రాజెక్టుల్లో తెలంగాణకు కేవలం 121 టీఎంసీలు మాత్రమే వాటా ఉన్నదని..తమకు 386 టీఎంసీల వాటా ఉన్నదని ఏపీ సర్కార్ వాదిస్తున్నది. ఆ మేరకే కృష్ణా నదిలో నీటి కేటాయింపులను చేపట్టాలని బ్రజేశ్ కుమార్​ ట్రిబ్యునల్​ (కృష్ణా వాటర్​ డిస్ప్యూట్​ ట్రిబ్యునల్​ 2– కేడబ్ల్యూడీటీ 2)కి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ట్రిబ్యునల్​లో అఫిడవిట్​ దాఖలు చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956లోని సెక్షన్​ 3 ప్రకారం.. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1005 టీఎంసీలతో పాటు పోలవరం గోదావరి డైవర్షన్​లోని 45 టీఎంసీలను కలిపి మొత్తం 1050 టీఎంసీల కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిందిగా నిరుడు అక్టోబర్​లో కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్​ను జారీ చేసింది. ఆ విచారణలో భాగంగా ఇప్పటికే రెండు రాష్ట్రాలూ స్టేట్మెంట్ ఆఫ్ కేస్​ (ఎస్ వోసీ)లను సమర్పించాయి. అయితే, ప్రాజెక్టుల ఆపరేషన్​ ప్రొటోకాల్​ అంశాలను మాత్రం సాక్షుల ద్వారా విచారించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో సాక్షుల అఫిడవిట్​ను సమర్పించాలని ట్రిబ్యునల్​ ఆదేశించడంతో.. ఏపీ తరఫున సాక్షిగా అనిల్​ కుమార్​ గోయల్​అఫిడవిట్​ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. జూరాలకు కొత్తగా ఆపరేషనల్​ ప్రొటోకాల్​ఏమీ అవసరం లేదని పేర్కొన్న ఏపీ.. మిగతా రెండు ప్రాజెక్టుల విషయంలో మాత్రం మార్పులు, చేర్పులు చేయాలని కోరింది. 

బచావత్​ అవార్డు ప్రకారమే చేయాలి

ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి కేడబ్ల్యూడీటీ 2 ప్రకారంగా ఆపరేషన్​ ప్రొటోకాల్​ రూపొందించారని.. అయితే, కేడబ్ల్యూడీటీ 1 (బచావత్​ ట్రిబ్యునల్​) అవార్డు ప్రకారమే ఆపరేషన్​ ప్రొటోకాల్​నిర్వహించాలని అఫిడవిట్​లో ఏపీ సర్కారు పేర్కొంది. దాని ప్రకారం చేసిన నీటి కేటాయింపులను కొనసాగించాలని కోరింది. జూరాల ప్రాజెక్టు నుంచి 46 టీఎంసీలకు మించి వాడుకోకుండా తెలంగాణను కంట్రోల్​ చేయాలని, అంతకు మించిన వరదను దిగువకు ఇచ్చేయాలని స్పష్టం చేసింది. శ్రీశైలంలో మినిమం  డ్రా డౌన్​ లెవెల్​ను 834 అడుగులు కాకుండా.. 854 అడుగులుగానే నిర్ధారించాలని తెలిపింది. క్యారీ ఓవర్​ జలాలను పాత కేటాయింపుల ప్రకారమే వాడుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫ్లడ్​ సీజన్​ తర్వాత మే వరకు నీటిని వాడుకున్నాక.. ఎండీడీఎల్​ 854 అడుగులకు పైన ఉన్న నీటిని జూన్​, జూలై నెలల్లో వాడుకునేలా క్యారీ ఓవర్​కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పోలవరం నుంచి గోదావరి జలాల డైవర్షన్​ ద్వారా ఎగువ రాష్ట్రాలకు లభించే 80 టీఎంసీల వాటాలో 45 టీఎంసీలపై పూర్తి హక్కు ఏపీకే ఉంటుందని తెలిపింది. 

పెన్నా రిజర్వాయర్లకు శ్రీశైలమే ఆధారం

బచావత్​ ట్రిబ్యునల్​ కేటాయింపులతో శ్రీశైలం ప్రాజెక్టు.. పెన్నా–కృష్ణా బేసిన్​ల ఉమ్మడి రిజర్వాయర్​గా మారిందని అఫిడవిట్​లో ఏపీ పేర్కొంది. పెన్నా బేసిన్​లోని వెలిగోడు, కండలేరు వంటి ప్రాజెక్టులు శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించింది. పులిచింతల ప్రాజెక్టును పూర్తిగా కృష్ణా డెల్టాకు నీటిని కేటాయించేందుకే వినియోగించాలని కోరింది. కాగా, ఏపీ అఫిడవిట్​కు రిప్లైగా రెండు వారాల్లోగా అఫిడవిట్​దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును ట్రిబ్యునల్​ ఆదేశించింది. ఏపీ సాక్షి అనిల్​ కుమార్​ గోయల్​ అఫిడవిట్​ ఆధారంగా.. వచ్చే నెల 6, 7, 8వ తేదీల్లో తెలంగాణ తరఫు అడ్వొకేట్​క్రాస్​ఎగ్జామినేషన్​ చేయనున్నారు.