- తెలంగాణను బద్నాం చేస్కుంటనే బరాబర్ కరెంట్ ఉత్పత్తి
- తెలంగాణ కరెంట్ ఉత్పత్తి ఆపాలంటూ ఫిర్యాదులు
- ప్రధానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు
- సుప్రీంకోర్టులోనూ కేసు
- తమ కరెంట్ ఉత్పత్తి మాత్రం యధాతథంగా కొనసాగింపు
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంలో తెలంగాణ పవర్ జనరేషన్ పై గగ్గోలుపెట్టిన ఏపీ ప్రభుత్వం మన రాష్ట్రంతో పోటీ పడి కరెంట్ ఉత్పత్తి చేస్తోంది. మనతో పోల్చితే ఏపీ కరెంట్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువే అయినా.. పూర్తి కెపాసిటీతో పవర్ జనరేట్ చేస్తోంది. రెండేండ్లుగా తెలంగాణ అడ్డగోలుగా కరెంట్ ఉత్పత్తి చేస్తోందని నిందలు వేస్తున్న ఏపీ సర్కారు.. దానికి విరుద్ధంగా పని చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా ప్రధానికి కంప్లైంట్ చేసింది. తెలంగాణ ఏకపక్షంగా కరెంట్ ఉత్పత్తి చేస్తూ తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తోందని సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిన ఏపీ సర్కారు.. పవర్ జనరేషన్ ను మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తోంది. ఈ ఫ్లడ్ సీజన్‌లో ఇప్పటి వరకు తెలంగాణ కరెంట్ కోసం 361 టీఎంసీల నీటిని వాడుకుంటే, ఏపీ 217 టీఎంసీల నీళ్లను ఉపయోగించుకుంది.
జల విద్యుత్ కోసమే శ్రీశైలం
శ్రీశైలం రిజర్వాయర్‌ను జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించారు. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ1)తో పాటు ప్లానింగ్ కమిషన్ ఇదే విషయం స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ రిజర్వాయర్‌లో లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ తెలంగాణ, రైట్ బ్యాంక్ పవర్ హౌస్ ఏపీ కరెంట్ అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలు, కృష్ణా డెల్టా సిస్టంకు అవసరమైన సాగు, తాగునీటిని ఇవ్వడానికి బ్యాకప్ రిజర్వాయర్‌గా శ్రీశైలంను నిర్మించారు. రెండు పవర్ హౌస్‌ల ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసిన నీటిని కృష్ణా నదిలోకి వదిలేస్తారు. ఆ నీళ్లు నాగార్జునసాగర్ కు చేరుతాయి. ఒకవేళ దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకుంటే రెండు పవర్ హౌస్‌ల్లో కరెంట్ ఉత్పత్తి చేసిన నీళ్లను రివర్సబుల్ టర్బైన్‌ల ద్వారా రిజర్వాయర్‌లోనే పోస్తారు. లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ కెపాసిటీ 900 మెగావాట్లు కాగా, రైట్ బ్యాంక్ పవర్ హౌస్ కెపాసిటీ 770 మెగావాట్లు ఉంది.
అడ్డగోలు ఫిర్యాదులు
శ్రీశైలం రిజర్వాయర్‌కు వరదలు ప్రారంభమైన తర్వాత తెలంగాణ (టీఎస్ జెన్‌కో) కరెంట్ ఉత్పత్తి మొదలు పెడుతుంది. మనతో పోల్చితే ఏటా ఏపీ (ఏపీ జెన్‌కో) కొంత ఆలస్యంగా కరెంట్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. కానీ నిరుటి (2020 -–21) నుంచి తెలంగాణ కరెంట్ ఉత్పత్తిపై ఏపీ అడ్డగోలు ఫిర్యాదులు చేస్తోంది. కేఆర్‌ఎంబీ నుంచి మొదలుకొని కేంద్ర ప్రభుత్వం వరకు 9 సార్లు కంప్లైంట్ చేసింది. ఏపీ సీఎం జగన్ ఏకంగా ప్రధానికే దీనిపై ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను జగన్ కలిసి కంప్లైంట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశంపై వైసీపీ ఎంపీలు రచ్చ చేశారు. కరెంట్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఇష్టం వచ్చినట్టుగా కరెంట్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీళ్లు లేకుండా చేస్తుంది కాబట్టే తాము సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని కేంద్రానికి చెప్పారు.
వద్దంటూనే.. కరెంట్ ఉత్పత్తి
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకునేందుకు వీలుగా రిజర్వాయర్‌లో కరెంట్ ఉత్పత్తి చేయవద్దని ఏపీ అడ్డగోలుగా వాదిస్తోంది. డ్యాం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా కృష్ణా బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్లు చేసింది. తెలంగాణ కరెంట్ ఉత్పత్తి ద్వారా తరలించే నీళ్లు నాగార్జునసాగర్‌లో నిల్వ ఉంటాయనే వాస్తవాన్ని తొక్కి పెట్టి, ఆ నీళ్లన్నీ రాష్ట్రం ఖాతాలో వేయాలనే వాదనను తెరపైకి తెచ్చింది. ఇన్ని చేసిన ఏపీ.. మరోవైపు ఫుల్ కెపాసిటీతో తమ జెన్ కో ద్వారా శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి కొనసాగిస్తోంది.
ఈ ఫ్లడ్ సీజన్‌లో జూన్ 1 నుంచి జనవరి 1 వరకు ఏపీ 25.14 లక్షల క్యూసెక్కుల నీళ్లను వాడుకుని 1,228 మిలియన్ యూనిట్ల (ఎంయూ) కరెంట్ ఉత్పత్తి చేసింది. తెలంగాణ 41.89 లక్షల క్యూసెక్కుల నీటితో 1,921 ఎంయూల పవర్ జనరేట్ చేసింది. రివర్సబుల్ టర్బైన్‌ల ద్వారా 76,862 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లోకి తిరిగి పంపుచేశారు. మొత్తంగా తెలంగాణ కరెంట్ ఉత్పత్తి కోసం 361.94 టీఎంసీల నీటిని వాడితే, ఏపీ 217.21 టీఎంసీల నీటిని వాడుకుంది. రెండు రాష్ట్రాల పవర్ ప్లాంట్ల కెపాసిటీ మధ్య తేడాలను పోల్చిచూస్తే దాదాపు సమానంగా కరెంట్ ఉత్పత్తి చేశాయి.