
ఏడాదిన్కరలో సంగమేశ్వరం కంప్లీట్ కావాలె
వర్క్ ఏజెన్సీకి టార్గెట్ పెట్టిన ఏపీ సర్కార్
2022 జూన్ నాటికి నీళ్లు ఎత్తిపోయాలని నిర్ణయం
ఎర్త్ వర్క్ స్పీడప్ చేసిన కాంట్రాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: ఫిక్స్ చేసిన టైం కంటే ఏడాది ముందే సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం పనులను కంప్లీట్ చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నా.. అంతకు 12 నెలల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీకి ఓరల్ ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పంపుహౌస్ పనులను స్పీడప్ చేశారు. వర్క్ ఏజెన్సీకి కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుండటంతో 2021 జూన్ నాటికి ఎర్త్ వర్క్ పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 2022 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
పర్యావరణ అనుమతుల కోసం..
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి సంగమేశ్వరం వద్ద ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ స్కీం పనులు మొదలు పెట్టింది. ఈ పనులు చేయడానికి ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్తోంది. పనులు చేస్తున్నది తమ రాష్ట్ర భూభాగంలోనే కాబట్టి ఎవరు అడ్డుకోలేరనే వైఖరిని ఏపీ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. 24 గంటలు పటిష్టమైన నిఘా మధ్య పనులు కొనసాగిస్తోంది. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఇప్పటికే దరఖాస్తు చేసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే 2016 ఈఐఏ యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ హియరింగ్ నిర్వహించి భూ సేకరణకు సంబంధించిన సాంకేతిక సమస్యలను అధిగమించాలనే ప్రయత్నాల్లో ఉంది. దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతానికి నీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన ప్రాజెక్టు కావడంతో సాయం చేయాలని గతంలోనే కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. మూడు రోజుల కిందట కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిన ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్.. ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించినట్టు తెలిసింది.
డీపీఆర్ విషయంలో జాగ్రత్తగా..
ప్రాజెక్టుకు కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్ రావాలంటే డీపీఆర్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. డీపీఆర్ ఇస్తామని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఏపీ వాటర్ రీసోర్సెస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఇంటర్నల్ కమ్యూనికేషన్స్‌లోనూ చెప్పారు. కానీ ఇంతవరకు బోర్డుకు డీపీఆర్ ఇవ్వలేదు. ఉన్నది ఉన్నట్టు కాకుండా డీపీఆర్‌లో కొంతమేరకు మార్పులు చేసి బోర్డుకు ఇచ్చే ప్రయత్నాల్లో ఏపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. టెండర్ షెడ్యూళ్లలో పేర్కొన్న కంటోనెంట్స్‌తో పాటు ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశాలు, ఎలా వయబుల్ అవుతుందనే వివరాల్లో మార్పులు చేసే అవకాశమున్నట్టు తెలిసింది.
పూర్తయ్యే సరికి పర్మిషన్లు
ప్రాజెక్టు పనులు పూర్తయి ప్రారంభించే నాటికి పర్మిషన్లు వస్తాయని, వాటి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదనే ధోరణిలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. టెక్నికల్ సమస్యలను అధిగమించడం పెద్ద విషయం కాదని, పనుల విషయం లో వెనక్కి తగ్గొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా లిఫ్ట్ స్కీం పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం. సంగమేశ్వరం పనులను మానిటరింగ్ చేసేందుకు కర్నూల్ ప్రాజెక్టుల సీఈకి అవసరమైన అదనపు సిబ్బంది , సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించినట్టు తెలిసింది.