
అమరావతి: డీఎస్సీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 2025 మెగా డీఎస్సీకి వయో పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. డీఎస్సీకి ప్రస్తుతమున్న 42 ఏళ్ల గరిష్ఠ వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపింది. అభ్యర్థుల కటాఫ్ తేదీని 2024, జూలై1గా నిర్ణయించింది. అయితే.. వయో పరిమితి సడలింపు కేవలం ఈ ఒక్క డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత ప్రభుత్వం వల్ల తమకు నష్టం జరిగిందని.. వయో పరిమితిని సడలించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఈ ఒక్క డీఎస్సీకి అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం పట్ల పలువురు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మరో వారం రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 6,371, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు (SA)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)-286, ప్రిన్సిపాల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (PET)-132 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డీఎస్సీ అర్హత పరీక్ష టెట్‌ను ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించింది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పించింది విద్యాశాఖ.