పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు నెలలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే.. మరుసటి నెలలోనే మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2024, నవంబర్ 21 గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పెన్షన్ దారులు రెండు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది.
ఏదైనా కారణాల వల్ల వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో ముందు రెండు నెలల పెన్షన్ ఇవ్వరు. ఈ నేపథ్యంలో పెన్షన్ దారుల కోసం కొత్త ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలల పెన్షన్ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకోవచ్చు. ఇక, కుటుంబ యాజమని మరణిస్తే అతడి పెన్షన్ రద్దు అవుతోంది. మృతుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
తాజాగా ఈ నిబంధనను కూడా ప్రభుత్వం మార్చింది. పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే.. మరుసటి నెలలోనే మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంపై పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెన్షన్లు అందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి నెల 3వ తేదీ లోపే పెన్షన్ పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తోంది.