- ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
- భద్రాచలంలో ఓపెన్ అయిన టికెట్ కౌంటర్లు
- పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750
భద్రాచలం, వెలుగు : ఈ నెల 9వ తేదీ నుంచి గోదావరిలో లాంచీల్లో పాపికొండలను తిలకించేందుకు ఆంధ్రా సర్కారు అనుమతినిచ్చింది. ఈ మేరకు భద్రాచలంలో కూడా శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న తర్వాత టూరిస్టులు పాపికొండల యాత్రకు వెళ్లేందుకు టికెట్కౌంటర్లు తెరిచారు. సోమవారం విలీన ఆంధ్రాలోని వీఆర్‌పురం మండలంలోని ఎస్సై, ఎంపీడీఓ, డీటీలు, లాంచీల యజమానులతో కలిసి ట్రయల్ రన్ నిర్వహించారు.
వీఆర్‌పురం మండలం పోచవరం నుంచి పాపికొండలు దాటాక తెల్లదిబ్బలు, కొర్టూరు వరకు లాంచీలో వెళ్లి వాతావరణం, ఇతర పరిస్థితులను పరిశీలించారు. అంతా సవ్యంగానే ఉందని ఆఫీసర్లు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 9వ తేదీ నుంచి పాపికొండల యాత్ర షురూ చేయనున్నారు. మొత్తం 17 లాంచీలకు అనుమతినిచ్చారు. ఒక్కో లాంచీలో సామర్థ్యాన్ని బట్టి 72, 82, 90 మంది టూరిస్టులను ఎక్కించుకునేందుకు పర్మిషన్ఇచ్చారు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 టిక్కెట్ ధర నిర్ణయించారు. పోచవరం నుంచి లాంచీ బయలుదేరి పాపికొండల్లోని కొర్టూరు వరకు వెళ్లి తిరిగి వస్తుంది. మధ్యలో పేరంటాలపల్లి ఆశ్రమం కూడా చూపిస్తారు. మార్గమధ్యలో టీ, టిఫిన్, భోజనం ఏర్పాటు చేయనున్నారు.