పింఛన్లపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ .. సచివాలయాల్లో పంపిణీ..

ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పింఛను లబ్ధిదారులు ఆధార్‌ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్‌ సూచించింది.

నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్ల సేవలను వినియోగించకూడదని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలతో నేపథ్యంలో సెర్ప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్  ముగిసే వరకు వాలంటీర్ల వద్ద ఉన్న మొబైల్స్‌, టాబ్లెట్స్‌, ఇతర ప్రభుత్వ పరికరాలను జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని సూచించింది. వాలంటీర్లపై ఫిర్యాదులు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఆదేశాలు ఇచ్చారు.
డీబీటీ స్కీంల అమల్లో వాలంటీర్లకు ప్రత్యామ్నాయాలు చూడాలని ఏపీ సీఈఓకు ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఏపీ సీఈఓ సూచించింది.