బనకచర్లపై ఏపీ దూకుడు.. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు..!

బనకచర్లపై ఏపీ దూకుడు.. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు..!
  • సీఎం చంద్రబాబు చైర్మన్​గా జలహారతి కార్పొరేషన్
  • ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఏపీ.. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు
  • ప్రాజెక్ట్​ పేపర్​పైనే ఉందని చెప్తూనే వేగంగా అడుగులు
  • ఇద్దరు డైరెక్టర్లు, 16 మంది ఇంజనీర్లు, ముగ్గురు అకౌంట్స్​ ఆఫీసర్స్​, ఒక సీఎఫ్​వోతో కేడర్​
  • ప్రభుత్వం పేరిట రూ.10 విలువ చేసే 49 లక్షలకుపైగా షేర్ల బదలాయింపు
  • మరో ఏడుగురికి ఒక్కో షేరు.. ప్రాజెక్టు వ్యయం రూ.80వేల కోట్లు

హైదరాబాద్, వెలుగు: గోదావరి– బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్ట్​పై ఏపీ దూకుడు పెంచుతున్నది. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని, తెలంగాణవన్నీ అభూతకల్పనలేనని చెబుతున్న ఆ రాష్ట్రం.. గ్రౌండ్​లో మాత్రం అందుకు విరుద్ధంగా ముందుకు వెళ్తున్నది. మన రాష్ట్రం ఆందోళన చెందుతున్నట్లుగా ఏమీ జరగడంలేదంటూ సోమవారం జరిగిన జీఆర్ఎంబీ మీటింగ్​లో చెప్పిన ఏపీ.. ఆ మీటింగ్​ నిర్వహించిన 24 గంటల్లోనే జీబీ లింక్​ ప్రాజెక్ట్​పై జలహారతి కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేసింది. 

రూ.80,112 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం.. ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్​గా ఈ కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఒక వైస్​చైర్మన్​, ఓ ఎండీ అండ్​ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు, 16 మంది ఇంజనీర్లు, ముగ్గురు అకౌంట్స్​ఆఫీసర్లు, ఒక చీఫ్​ ఫైనాన్షియల్​ఆఫీసర్‎తో కార్పొరేషన్​ను ఏర్పాటు చేసింది. జస్ట్​ పేపర్​ మీద పెట్టిన ప్రాజెక్టుపై తెలంగాణ రాద్ధాంతం చేస్తున్నదంటూ నిన్నమొన్నటిదాకా మభ్యపెడ్తూ వచ్చిన  ఆ రాష్ట్రం.. దానిని గ్రౌండ్​ వరకు తీసుకెళ్లేందుకు చకచకా పనులు కానిచ్చేస్తున్నది.

 అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారమూ తీసుకుంటున్నది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్​ డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్టు (డీపీఆర్​)ను రెడీ చేసేసి కేంద్రానికి పంపించి.. ఆ వెంటనే పనులు చేపట్టేందుకు  రంగం సిద్ధం చేసుకుంటున్నది. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు భారీ వ్యయం కానుండడంతో నిధుల సమీకరణకు ఏపీ సర్కారు ‘జలహారతి కార్పొరేషన్’ ను ఏర్పాటు చేస్తున్నది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతోపాటు ప్రభుత్వ ఈక్విటీ ద్వారా నిధులను సమీకరించుకోవాలని నిర్ణయించింది.

 ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా ఈ కార్పొరేషన్​ ద్వారా నిధులు సమీకరించుకోబోతున్నది. ఇటు పబ్లిక్,​ అటు మార్కెట్​లోని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని సులభంగా ముందుకు తీసుకుపోవచ్చని యోచిస్తున్నది. జల హారతి కార్పొరేషన్​ను స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. కేవలం నిధులు రాబట్టడం కోసమే కాకుండా ఆ ప్రాజెక్టును  పూర్తి చేసేందుకు సర్వహక్కులను ఇచ్చింది. 

సంస్థకు డైరెక్టర్లనూ నియమించి షేర్లనూ కేటాయించింది.   రూ.10 విలువ చేసే 49 లక్షల 99 వేల 993 షేర్లను కార్పొరేషన్​ పేరిట బదలాయించింది. మరో ఏడు షేర్లను డైరెక్టర్లు, సీఈల (డైరెక్టర్– ఫైనాన్స్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ, డైరెక్టర్​– ప్రాజెక్ట్స్​ (ఈఎన్​సీ), డైరెక్టర్(ఈఎన్​సీ అడ్మిన్​), పోలవరం ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ సీఈ, కృష్ణా డెల్టా సీఈ, ఒంగోలు సీఈ, కర్నూల్​ సీఈ) పేరిట సబ్​స్క్రైబ్​ చేసింది. మొత్తంగా రూ.5 కోట్ల విలువైన 50 లక్షల షేర్లను ఇచ్చింది. చైర్మన్​గా ఏపీ సీఎం, వైస్​చైర్మన్​గా ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉండనున్నారు. 

ఎండీ, సీఈవోగా జలవనరుల శాఖ స్పెషల్​ సీఎస్​, డైరెక్టర్లుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఈఎన్​సీలను నియమించింది. కార్పొరేషన్​కు స్టాఫ్​ను కూడా ఏపీ సర్కారు కేటాయించింది. జలవనరుల శాఖ నుంచి డిప్యూటేషన్​పై సీఈ, ఇద్దరు ఎస్ఈలు, ముగ్గురు ఈఈలు, పది మంది డీఈఈ/ఏఈఈలను నియమించనుంది. బయటి (ప్రైవేట్​) నుంచి ముగ్గురు చార్టర్డ్​ అకౌంటెంట్లతోపాటు మార్కెట్​లో (ప్రైవేట్) 15 ఏండ్ల అనుభవం ఉన్న చార్టర్డ్​ అకౌంటెంట్​ను చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​గా నియమించనుంది. 

కృష్ణా ప్రాజెక్టుల ప్రస్తావన 

జలహారతి కార్పొరేషన్​ ఏర్పాటు జీవోలో శ్రీశైలం ఆధారంగా చేపడుతున్న ప్రాజెక్టులనూ ఏపీ ప్రస్తావించింది. శ్రీశైలం ఆధారంగా చేపడుతున్న ప్రాజెక్టులైనా.. గోదావరి నుంచి బనకచర్లకు తరలించే లింక్​ ప్రాజెక్ట్​ అయినా ఔట్​ బేసిన్​లోని రాయలసీమ (పెన్నా బేసిన్​) ప్రాంతానికి నీటిని తరలించేందుకు చేపడుతున్నట్టు పేర్కొన్నది.  వర్షాభావం ఉన్న ఆ ప్రాంతంలో కరువును తీర్చాలంటే నీటి తరలింపు ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది. రాయలసీమ నీటి అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్​ ఆధారంగా పలు ప్రాజెక్టులను  చేపట్టినట్టు పేర్కొంది. 

ఇటు పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ ద్వారా నీటిని తీసుకెళ్తున్నట్టు స్పష్టంగా చెప్పింది. దాంతోపాటు గోదావరిలో మిగులు జలాలను రాయలసీమకు తరలించి.. ఆ ప్రాంత అవసరాలను తీర్చేలా జీబీ లింక్​ను చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. కాల్వలు, లిఫ్టులు, అండర్​గ్రౌండ్​ పైప్​లైన్లు, సొరంగాల ద్వారా నల్లమల కొండల నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలిస్తామని పేర్కొన్నది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీటిని ఇవ్వడంతోపాటు 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, మరో 22.50 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీటిని అందిస్తామని వెల్లడించింది. 

 తెలంగాణ అభ్యంతరాలు ఇవీ..

గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతున్నదనే అనుమానాలున్నాయి. గోదావరి– బనకచర్ల  లింక్​ను నేరుగా సాగర్​ మెయిన్​కెనాల్​కు కలపడం, అక్కడి నుంచి 150 టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్ కు మళ్లించడమంటే కృష్ణా నీటి దోపిడీకీ ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందని ఎక్స్​పర్ట్స్​హెచ్చరిస్తున్నారు.  
    
దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలీమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు.. గోదావరిని కృష్ణాతో లింక్​ చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తిచేస్తే ఏ నీళ్లు ఎటువెళ్తున్నాయో తెలిసే పరిస్థితి ఉండదు.
    
రూ.80 వేల కోట్లతో ఏపీలో 240 కిలో మీటర్ల పొడవునా లిఫ్టులు, టన్నెళ్లు, కెనాల్స్ తో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఇక్కడ ఏపీ పాలకుల  ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తున్నది.
    
నిజానికి ఏ నది నీళ్లయినా ఆ నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లోనే ఉపయోగించుకోవాలని అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ నిబంధనలు చెప్తున్నాయి. దీనికి విరుద్ధంగా దశాబ్దాలుగా తెలంగాణ హక్కులకు గండి కొడుతూ కృష్ణా నీటిని పెన్నా బేసిన్​కు తరలిస్తున్నారు. ఇప్పుడు జీబీ లింక్​తో దీనిని శాశ్వతం చేసుకునే పన్నాగం పన్నుతున్నారు.
    
గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ వాదిస్తున్నది. అలా వాడుకోకుండా సముద్రంలో కలుస్తున్న వరద జలాల్లో 200 టీఎంసీలను బనకచర్లకు తరలిస్తామని అంటున్నది. వాస్తవానికి 2 రాష్ట్రాలకు కలిపి గోదావరిలో కేటాయించిన 1,486  టీఎంసీల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలనే వాడుకోవడం లేదు.  ఇలా నికర జలాలనే వాడుకోలేనప్పుడు వరద జలాల పేరుతో నీళ్లు మళ్లిస్తామనడమే అనుమానాలను పెంచుతున్నది.