అమరావతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ అపవిత్రం కావడంపై విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది.
ఐజీ ర్యాంక్ స్థాయి అధికారితో ఏర్పాటు కానున్న సిట్.. లడ్డూ అపవిత్రానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. తిరుమలలో అధికార దుర్వినియోగంపైన సిట్ విచారణ చేపట్టనుంది. లడ్డూ కల్తీపై సిట్ నివేదిక ఆధారంగా నిందితులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టెంపుల్ పవిత్రతను కాపాడటం తమ బాధ్యత అని.. నిందితులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ALSO READ | తిరుపతి లడ్డూ లొల్లి: ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
మరోవైపు తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ కావడంతో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ ప్రసాదం అపవిత్రంపై రేపు (సెప్టెంబర్ 23) తిరుమలలో శాంతియాగం నిర్వహించనుంది. సోమవారం ఉదయం ఆరు గంటల నుండి శాంతియాగం ప్రారంభం కానుండగా.. విమాన ప్రకారం దగ్గర యాగశాలలో శాంతియాగానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. శాంతియాగం ముగిసిన తర్వాత అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఇందు కోసం మొత్తం మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఈ శాంతియాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొననున్నారు.