మహిళలకు శుభవార్త.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు

మహిళలకు శుభవార్త.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు

ఏపీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీలలో ఒకటైన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుండి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పథకంపై సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా మాట్లాడిన ఏపీ సీఎం.. మహిళల సంక్షేమం కోసం కూటమి(టీడీపీ- జనసేన-బీజేపీ) ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీపం పథకం ఏపీ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఆడపడుచులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.2,684 కోట్ల భారం పడనుంది. 

కండిషన్స్ అప్లై.. 

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ పథకానికి ఆడపడుచులందరూ అర్హులే అన్నట్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కండిషన్స్ పెట్టారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన వారికి మాత్రమే దీపం పథకంలో 3 సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. అలాగే, లబ్దిదారులు ముందుగా డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. తరువాత రోజుల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీని జమ చేస్తారు.

అర్హతలు

  • ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి.
  • తెల్లరేషన్ కార్డు ఉండాలి.
  • గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
  • బీపీఎల్ కుటుంబాలు మాత్రమే అర్హులు

అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • తెల్ల రేషన్ కార్డు
  • మొబైల్ నంబర్
  • కరెంట్ బిల్లు
  • స్థానికతను ధృవీకరించే సర్టిఫికెట్

ముందుగా లభ్డిదారులు దీపం పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు సూచించిన విధంగా సంబంధిత వెబ్ సైట్ లో లబ్దిదారుల పేరు, చిరునామా నమోదు చేయాలి. ఆ సమయంలో అవసరమైన డాక్యుమెంట్ల ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయాలి. ఆ దరఖాస్తుదారులను అధికారులు పరిశీలించి, అర్హులైన వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తారు.

ALSO READ | అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభించిన సీఎం చంద్రబాబు