బనకచర్లతో ఏపీ భారీ కుట్ర!..ఇటు కృష్ణా.. అటు గోదావరి నుంచి జలదోపిడీకి ప్రయత్నాలు

బనకచర్లతో ఏపీ భారీ కుట్ర!..ఇటు కృష్ణా.. అటు గోదావరి నుంచి జలదోపిడీకి ప్రయత్నాలు
  • పోలవరం నుంచి బనకచర్ల హెడ్​రెగ్యులేటర్​కు ఏకంగా 200 టీఎంసీలు తరలించే ప్లాన్​
  • నాగార్జున సాగర్​ కుడి కాల్వను వెడల్పు చేసి చిన్నపాటి రిజర్వాయర్​గా వాడాలనే యోచన
  • గోదావరిలో సర్​ప్లస్​ జలాల నుంచే అని చెబుతున్నా కృష్ణా నుంచి తోడుకునే ఎత్తుగడ 
  • తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే కుతంత్రం 

హైదరాబాద్​, వెలుగు: పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​స్కీమ్​ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే కృష్ణా నీటికి గండికొడుతున్న ఏపీ మరో భారీ కుట్రకు తెరలేపింది.  గోదావరి(పోలవరం)–బనకచర్ల (జీ–బీ) లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించుకుపోయేందుకు ప్లాన్​ వేసింది.  గోదావరి వరదల్లో మిగులు జలాలనే తీసుకెళ్తామని చెబుతున్నా.. గుట్టుగా కృష్ణా జలాలనూ తరలించుకుపోయేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టేలా జీ–బీ లింక్​ ప్రాజెక్టును చేపడుతున్నదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. 

ఏకంగా 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్​లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి పెన్నా బేసిన్​లోని బనకచర్ల ద్వారా రాయలసీమకు తరలించాలని డిసైడ్​ అయింది. అసలు ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్ లోనే లేని రాయలసీమకు కర్నూలు జిల్లాలోని పాములపాడు మండలంలో ఉన్న బనకచర్ల హెడ్​రెగ్యులేటర్​ద్వారా నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నది. దీంతో ఇటు గోదావరి, అటు కృష్ణా నదీ జలాలను అడ్డంగా దోచుకునేందుకు ప్రణాళికా ప్రకారం ముందుకు సాగుతున్నది. బేసిన్​ అవసరాలకు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకూ అడ్డుపడుతున్న ఏపీ.. తాను మాత్రం దొంగదారిలో ఇటు రెండు నదుల నుంచి జలదోపిడీకి కుట్ర పన్నుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు.. ఏపీ చేపడుతున్న ఆ ప్రాజెక్టుకు అభ్యంతరాలు తెలుపుతున్నది. త్వరలోనే దీనిపై జీఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నది.  

సాగర్​ కుడి కాల్వలోకి ఎత్తిపోసి..

నీటి తరలింపు విషయంలో ఏపీ పక్కా స్కెచ్​తోనే ముందుకెళ్తున్నట్టు ఆ రాష్ట్రం ప్రాజెక్ట్​ లైన్​ డయాగ్రమ్​ ద్వారానే తెలిసిపోతున్నది. నాగార్జునసాగర్​ కుడి కాల్వనే ఓ రిజర్వాయర్​గా మార్చి బనకచర్లకు నీటిని తరలించేలా ప్లాన్​ చేసింది. తొలుత ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీలోకి తాడిపూడి మెయిన్​ కెనాల్​ ద్వారా నీటిని తరలించి.. అక్కడి నుంచి రెండో స్టేజ్​లో సాగర్​ కుడి కాల్వ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్​కు తరలించేలా ప్రాజెక్టుకు డిజైన్​ చేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్​కు మధ్యలో ఆరు లిఫ్ట్​ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నది. 

Also Read :- తెలంగాణపై పోలవరం ఎఫెక్ట్​ ఎంత.?

ప్రకాశం బ్యారేజీ, పులిచింతల ప్రాజెక్టుకు మధ్య వైకుంఠపురం వద్ద ఓ బ్యారేజీనీ నిర్మించాలని యోచిస్తున్నది. సాగర్​ కుడి కాల్వను.. ఆ కాల్వ 80వ కిలోమీటర్​ పాయింట్​ వద్ద వెడల్పు చేయనున్నది. తద్వారా ఆ పాయింట్​ వద్ద సాగర్​ కుడికాల్వను ఓ రిజర్వాయర్​లా మార్చేందుకు ఎత్తుగడ వేసింది. ఇక్కడి వరకు ఐదు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ఏపీ.. కుడి కాల్వ పాయింట్​ తర్వాత మరో లిఫ్ట్​ను నిర్మించి బొల్లాపల్లి రిజర్వాయర్​కు నీటి తరలింపునకు పూనుకొన్నది. ఇక మూడో స్టేజ్​లో భాగంగా బొల్లాపల్లి రిజర్వాయర్​ నుంచి బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​కు మూడు లిఫ్టులు, రెండు సొరంగాల ద్వారా నీటిని తరలించనున్నది. ఈ మధ్యలో వచ్చే ఒక సొరంగం పొడవు 25.6 కిలోమీటర్లు కావడం గమనార్హం. ఈ మొత్తం జీ–బీ ప్రాజెక్టు కోసం రూ.80,112 కోట్లు ఖర్చు పెడుతున్న ఏపీ సర్కారు.. స్టేజ్​1 (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీవరకు) లో 198 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వలను తవ్వనున్నది. స్టేజ్​ 2లో 84  కిలోమీటర్లు, మూడో స్టేజ్​లో 108.4 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలతో నీటిని తరలించనున్నది. మొత్తంగా 400.4 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించనుననది.

సర్​ప్లస్ అని చెప్తున్నా..

గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ వాదిస్తున్నది. అలా వాడుకోకుండా సముద్రంలో కలుస్తున్న వరద జలాలనే బనకచర్లకు తరలిస్తామని అంటున్నది. కానీ, వాస్తవానికి 2 రాష్ట్రాలకు గోదావరిలో కేటాయించిన 1,486 టీఎంసీలకు మించి వాడుకునేందుకు హక్కులు లేవు. నదీ జలాల పంపకంలో భాగంగా ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 516  టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులున్నాయి. అంతకుమించి వాడుకునేందుకు వీల్లేదు. కానీ, ఇక్కడే ఏపీ తెలివిగా వ్యవహరించింది. సముద్రంలో కలుస్తున్న జలాల్లో సర్​ప్లస్​ ఉన్న ఏడాదిలోనే 200 టీఎంసీలను తరలిస్తామంటున్నది. కానీ, ఇప్పటికీ ఏ రాష్ట్రానికీ ఆ మిగులు జలాల్లో కేటాయింపులనేవే లేవు. కేటాయింపులు లేకుండానే ఆ జలాలను తరలించి అనుచిత లబ్ధి పొందేందుకు ఏపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. దీనివల్ల కూడా  తెలంగాణకు అన్యాయం జరగకపోదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  లోటు సంవత్సరాల్లో ఇటు కృష్ణా నుంచి కూడా నీటిని ఆ లిఫ్టుల ద్వారా తరలించుకునే ఎత్తుగడ కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే సాగర్​ ప్రాజెక్టు స్పిల్​ వే నుంచి దిగువకు వదిలిన నీటి నుంచి కూడా తోడుకునే కుట్రలూ అందులో భాగమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

వాటాలు తేలకముందే..

వాస్తవానికి కృష్ణా ట్రిబ్యునల్​లో నీటి వాటాల కేటాయింపులపై ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. 811 టీఎంసీల్లో తెలంగాణ సగం వాటాకు పట్టుబడుతున్నది. బేసిన్​పరంగా చూసుకుంటే 555 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయని ట్రిబ్యునల్​ ముందు వాదనలు వినిపిస్తున్నది. కానీ, కృష్ణాలో వాటాలు తేలకముందే ఏపీ మాత్రం కృష్ణా బేసిన్​ ద్వారానే పెన్నా బేసిన్​లోని రాయలసీమకు నీటిని తరలించాలని మాస్టర్​ ప్లాన్​ వేసింది. 

 ఇప్పటికే శ్రీశైలానికి భారీ గండ్లు కొట్టిన ఏపీ

ఇప్పటికే శ్రీశైలానికి ఏపీ భారీ గండ్లు కొట్టింది. 44,600 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ (శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్​) కెపాసిటీని మరో పది వెంట్లు పెంచి 1,56,100 క్యూసెక్కులకు చేర్చింది. అక్కడి నుంచే బనకచర్ల కాంప్లెక్స్​కు తరలించి శ్రీశైలం రైట్​ బ్రాంచ్​ కెనాల్​, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టు కెనాల్, నిప్పులవాగు ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నది. అది చాలదన్నట్టు సంగమేశ్వరం వద్ద శ్రీశైలం డెడ్​స్టోరేజీ నుంచి నీటిని దొడ్డిదారిలో తోడుకుని వెళ్లేలా రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టునూ చేపట్టింది. అక్కడి నుంచి రోజూ 3 టీఎంసీల నీటిని శ్రీశైలం రైట్​మెయిన్​ కెనాల్​కు తరలించి బనకచర్లకు తీసుకుపోనున్నది. రైట్​మెయిన్​ కెనాల్​ లైనింగ్​ను పెంచి అంతకుమించి నీటిని తీసుకుపోయేందుకూ ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తంగా ఇటు కృష్ణా.. అటు గోదావరి బేసిన్​ నుంచి నీటిని దొడ్డిదారిలో ఏపీ మళ్లించుకుపోయే కుట్రలకు పూనుకుంటున్నదన్న వాదన వినిపిస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.