ఫిబ్రవరి 15న వాలంటీర్లకు వందనం కార్యక్రమం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకువచ్చిన వాలంటీర్‌ వ్యవస్థ కీలకంగా మారింది. నాలుగేళ్లుగా  ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళుతున్న వాలంటీర్లను ప్రభుత్వం సత్కరిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా వాలంటీర్లకు వందనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.ఈ వాలంటీర్లకు వందనం నాలుగో విడత కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  ప్రజలకు సంక్షేమ పథకాలను సకాలంలో అందించడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోనికనీసం ఏడాదిపాటు నిరాటంకంగా పని చేస్తున్న వాలంటీర్లందరినీ సత్కరించి, మూడు కేటగిరీల్లో నగదు బహుమతులను కూడా అందించనుంది. రాష్ట్రమంతటా అసెంబ్లీ నియోజకవర్గాలు వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఆ ప్రాంత వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

2 లక్షల 55 వేల 464 మంది వాలంటీర్లకు సత్కారం

వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహిస్తున్న నాలుగో ఏడాది కార్యక్రమంలో భాగగా 2 లక్షల 55 వేల 464 మంది వాలంటీర్లను సత్కరించనున్నారు. వీరిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సేవా వజ్ర, సేవా రత్న అవార్డులతోను, నిరాటంకంగా ఏడాది పని చేసిన వారికి సేవా మిత్ర అవార్డుతో సత్కరించి నగదు బహుమతి అందించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున మొత్తం 875 మందికి వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ఇవ్వనున్నారు. ప్రతి మండలంలో, మున్సిపాలిటీలో ఐదుగురు చొప్పున 4,150 మందికి సేవా రత్న అవార్డును ఇవ్వనున్నారు.

 కనీసం ఏడాదిపాటు పని చేసిన మిగిలిన 2,50,439 మంది వాలంటీర్లకు సేవామిత్ర అవార్డును అందించనున్నారు. ఈ అవార్డులకు అదనంగా తమ పరిధిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత పథకాలతో మెరుగైన లబ్ధిదారుల జీవన ప్రమాణాలపై ఉత్తమ వీడియోలు చిత్రీకరించిన వాలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతులు కూడా ఈ ఏడాది కొత్తగా అందించనున్నారు. 

796 ఉత్తమ వీడియోలు ఎంపిక

రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపల్‌, కార్పొరేషన్‌ స్థాయిల్లో ఒకొక్కటి వంతున 796 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన వారికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. నియోజకవర్గస్థాయిలో ఒకొక్కటి వంతున 175 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి, వాటిని చిత్రీకరించిన వారికి రూ.20 వేలు అదించనున్నారు. జిల్లా స్థాయిలో ఒక ఉత్తమ వీడియోను ఎంపిక చేసి వాటిని చిత్రీకించిన 26 మందికి రూ.25 వేలు చొప్పున ప్రత్యేక నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహణ ద్వారా వాలంటీర్లను ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన పని తీరు కనబరిచేలా దోహదం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.